నేడు సీఎం కిరణ్ దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. విభజన బిల్లుపై రెండుగా చీలిన సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేత లు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తొలిరోజే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగనున్నారు. ఇందులో సీఎంతోపాటు సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పోటీగా తెలంగాణ నేతలు కూడా రాజ్‌ఘాట్ వద్ద మౌనదీక్షకు దిగాలని భావించినా.. చివరికి అధిష్టానం జోక్యంతో విరమించుకున్నారు. దీక్ష అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని విన్నవించనుంది. తెలంగాణ నేతలు కూడా గురువారం రాష్ట్రపతిని కలసి సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొట్టాలని కోరనున్నారు.
శక్తిస్థల్ టు జంతర్‌మంతర్: విభజన బిల్లుపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ మంగళవారం సీమాంధ్ర నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు, వట్టి వసంత్‌కుమార్, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శైలజానాథ్, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగుంట శ్రీనివాసులరెడ్డిలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన విడివిడిగా మంతనాలు జరిపారు. ఈ సందర్భంగానే ఇందిరాగాంధీ సమాధి ‘శక్తిస్థల్’లో మరమ్మతులు జరుగుతున్న విషయాన్ని తెలిపి దీక్షాస్థలిని జంతర్‌మంతర్‌కు మారుద్దామని లగడపాటి తెలిపారు. ఇందుకు సీఎం సహా ముఖ్య నేతలంతా అంగీకరించారు. మొదట రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించి అటు నుంచి నేరుగా జంతర్‌మంతర్ వద్దకు చేరుకుని, అక్కడ నాలుగు గంటల వరకు నిరసన తెలపాలని, తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు.
వారించిన హైకమాండ్: ఇరు ప్రాంతాల ఎంపీలతో మంగళవారం కాంగ్రెస్ వార్‌రూమ్‌లో అధిష్టాన పెద్దలు సమావేశం నిర్వహించారు. సీఎం సహా నేతలంతా తమ దీక్షను విరమించుకోవాలని ఈ భేటీకి హాజరైన సీమాంధ్ర ఎంపీలను దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కోరారు. అయితే లగడపాటితోపాటు మిగతా ఒకరిద్దరు ఎంపీలు గట్టిగా తిరస్కరించారని తెలిసింది. సమావేశం అనంతరం ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట విలేకరులతో మాట్లాడుతూ... సీఎం నిరసనకు హాజరవుతామని స్పష్టం చేశారు.
హామీతో వెనక్కి తగ్గిన తెలంగాణ నేతలు: సీఎం దీక్షకు పోటీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌ఘాట్ వద్ద దీక్ష చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా వార్‌రూమ్ సమావేశం తర్వాత వెనక్కి తగ్గారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జైరాం రమేశ్, దిగ్విజయ్‌లు వారికి చెప్పారు. పార్టీని నష్టపరిచే రీతిలో ఇరుప్రాంత నేతలు నడచుకోవడం భావ్యం కాదని, దీక్షను విరమించుకోవాలని కోరారు. ఇందుకు తెలంగాణ ఎంపీలు అంగీకరించారు. వార్‌రూమ్ భేటీకి ముందు జానారెడ్డి మాట్లాడుతూ సీఎంపై విరుచుకుపడ్డారు. విభజనపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేందుకు విష ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘బిల్లును ఆమోదింపజేయడానికి 6న రాష్ట్రపతిని కలిస్తాం. వీలును బట్టి రాజ్‌నాథ్‌సింగ్‌ను సైతం కలసే ప్రయత్నం చేస్తున్నాం’’ అని తెలిపారు.