తెరవెనుక కిరణ్ కసరత్తు
ఓట్లు, సీట్లే లక్ష్యంగా రాష్ట్ర విభజనకు తెరతీసిన కాంగ్రెస్ అధిష్టానం గేమ్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. ‘విభజనతో సమస్యలు’, ‘విభజన తుపానును అడ్డుకుంటా’ అనే ప్రకటనలతో ఒకవైపు ప్రజలను ఏమార్చుతూ.. అంతర్గతంగా విభజనకు అన్నివిధాలా సహకరిస్తున్నారని సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడ్డ నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
* రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నదనే విషయం నాటి సీడబ్ల్యూసీ భేటీకన్నా చాలా ముందే కిరణ్‌కు తెలుసు. అయినా స్పందించలేదు. ఆయన అప్పుడే రాజీనామా చేస్తానంటే అధిష్టానం పునరాలోచనలో పడేది.
* సీడబ్ల్యూసీ భేటీకి ముందు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో అధికారికంగా విభజన నిర్ణయం తీసుకునేటప్పుడు కిరణ్ స్వయంగా ఉన్నారు. ‘రోడ్ మ్యాప్’ కూడా అందించారు. కానీ.. విభజన నిర్ణయంపై కనీసం అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు.
* రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేస్తూ సీడబ్ల్యూసీ ప్రకటన చేసినా కిరణ్ స్పందించలేదు. నిరసన వ్యక్తం చేయలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఊసే లేదు.
* విభజన ప్రకటనపై సీమాంధ్ర భగ్గుమన్నా.. ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడ్డా ఆయన కిమ్మనలేదు. ప్రకటన వెలువడిన 9 రోజుల తర్వాత తీరిగ్గా మీడియా ముందుకొచ్చారు. ‘విభజనతో సమస్యలే’నంటూ సన్నాయి నొక్కులతో సరిపెట్టారు.
* విభజన నిర్ణయంపై ఆగ్రహంతో కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు.. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం సృష్టిద్దామంటే.. వారిని కిరణ్ వారించారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుంది.. దాన్ని ఓడిద్దామని మాయమాటలు చెప్తూ కొంతకాలం నెట్టుకొచ్చారు.
* మళ్లీ 50 రోజులకు కిరణ్ మరోసారి మీడియా ముందుకొచ్చి.. ‘విభజిస్తే సమస్యలే’నంటూ పలు అంశాలను వల్లెవేశారు. తద్వారా ‘స్వయంగా ముఖ్యమంత్రే విభజనను అడ్డుకుంటున్నారు’ అనే భావన కలిగించే ప్రయత్నం చేశారు.
* దాదాపు 80 రోజుల పాటు ఉద్యోగుల సమ్మె, ఆందోళనలతో కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు కిరణే రంగప్రవేశం చేసి.. తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామన్న సాకు చూపి సమ్మెను విరమింపజేశారు. అది రాజకీయ మలుపు తిరగకుండా జాగ్రత్తపడ్డారు.
* విభజనపై కేంద్రం కేబినెట్ నోట్ రూపకల్పనకు ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయించి కేంద్రానికి పంపినా అది దాని ముందరి కాళ్లకు బంధంగా మారేది. కానీ కిరణ్ కావాలనే విస్మరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతగా డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.
* తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం ఉండదని తేలిపోవడంతో కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన 371 (డి) అధికరణాన్ని సాకుగా చూపుతూ.. ‘నేనున్నంత వరకు విభజన జరగదు’ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
* తన పరిధిలో ఉన్న అసెంబ్లీ తీర్మానం విషయాన్ని దాటవేస్తున్న కిరణ్.. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లకు లేఖల పేరుతో మరోసారి డ్రామా ఆడారు.
* నిజానికి అసెంబ్లీ ఇప్పటికీ ప్రొరోగ్ కాలేదు. సమావేశం నిర్వహించే అధికారం కిరణ్ చేతిలోనే ఉంది. విభజనపై ఏర్పాటైన జీఓఎంకు నివేదిక సమర్పించటానికి ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే ఉపయోగముంటుంది. కిరణ్ దీనినీ పట్టించుకోవటం లేదు.
* విభజనకు సహకరించి.. అంతా అయిపోయాక చివరికి సమైక్యవాది ముసుగులో కొత్త పార్టీకి కిరణే నేత ృత్వం వహిస్తారని.. ఇదంతా కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అనేది ఇప్పుడు బహిరంగ రహస్యం.