
ధావన్.. నువ్విలాగే దూసుకుపో..!
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో తన దూకుడేంటో మరోసారి చాటాడు ఓపెనర్ శిఖర్ ధావన్. 90 బంతుల్లో 132 పరుగులతో స్వైరవిహారం చేసిన ధావన్ టీమిండియాకు మరో సునాయస విజయాన్ని అందించాడు. ధావన్‌కు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (70 బంతుల్లో 82 పరుగులు) కూడా చెలరేగడంతో 127 బంతులు మిగిలి ఉండగానే భారత్ 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓ జోడీ అజేయంగా 197 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా.. 200పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లో ఛేజ్ చేసి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా ఓపెనర్ ధావన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. ధావన్ తన దూకుడును ఇదేవిధంగా కొనసాగించాలని, ఇదే 'హ్యాపీజోన్'లో ఉంటూ భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని సూచించాడు. 'గత మూడు నెలలుగా ధావన్ గొప్పగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో అతని విజయపరంపర కొనసాగుతోంది. ఇదే హ్యాపీజోన్‌లో అతను కొనసాగుతూ.. జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి అతను దూకుడు మొదలుపెట్టాడంటే అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు' అని మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లి పేర్కొన్నాడు.