తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న హైవోల్టెజ్ డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 122 మంది సభ్యుల మద్దతుతో ఆయన మెజారిటీ నిరూపించుకున్నారు. అయితే, అంతకుముందు తమిళనాడు శాసనసభలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, అల్లరితో సభ గందరగోళంగా మారిపోయింది. రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు మైక్‌లు, బల్లాలు విరిచివేయడమే కాకుండా..స్పీకర్‌ను నెట్టేసి ఆయన స్థానంలో కూర్చున్నారు. తీవ్ర గలాటా సృష్టించారు. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ సహా రాధిక, ఖుష్బూ, అరవింద స్వామి తదితరులు తీవ్రంగా స్పందించారు.
'మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంద'ని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారంటూ హెచ్చరించారు. సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని సినీ రాధికా శరత్‌కుమార్ కోరారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని, ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా మీడియాను బ్లాక్ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.