చంద్రబాబు నిప్పు అయితే ఎందుకు తప్పించుకుంటున్నారు?
- వైఎస్సార్‌సీపీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి
- దర్యాప్తును త్వరగా ముగించాలని కేసీఆర్‌కు వినతి
సాక్షి, హైదరాబాద్: తనకు తాను నిప్పురవ్వ అని ప్రచారం చేసుకునే ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో 14 నెలలుగా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రశ్నించింది. తాజాగా ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణకు ఆదేశించినా, దానిపై చంద్రబాబు మాట్లాడకుండా ఏవో సొల్లు కబుర్లు చెబుతూ, దీనిపై తాను స్పందించడమేమిటి.. అడ్వొకేట్లు చూసుకుంటారని చెప్పి తప్పించుకోచూస్తున్నారని.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు.
చంద్రబాబు ఒక వ్యక్తి కాదని, ఒక రాష్ట్రానికి సీఎం అని, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం తప్పిదం చేసి యావత్ 6 కోట్ల తెలుగు ప్రజలకు తలవంపులు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు ఈ కేసును త్వరితంగా దర్యాప్తు చేసి నిందితులను తేల్చేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును పునర్విచారించాలని కోర్టు ఆదేశించిన వెంటనే గవర్నర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాత అడ్వొకేట్ జనరల్, ఏసీబీ డీజీ ఏకేఖాన్‌లు కలుసుకుని వివరాలు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయన్నారు.
చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, కేసీఆర్‌తో లోపాయికారిగా అవగాహనకు వస్తారని ప్రజల్లో జరుగుతున్న ప్రచారానికి ఆస్కారమివ్వకూడదని పేర్కొన్నారు. విచారణలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ కేసులో గతంలోనే ప్రాథమిక విచారణ పూర్తయినందున సెప్టెంబర్ 29 వరకు ఆగకుండా త్వరితంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
2న ఘనంగా వైఎస్సార్ వర్ధంతి..: ప్రజల మనిషిగా గుర్తింపు పొంది, జనరంజక పాలనను అందించిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఒక ఏపీకో, తెలంగాణకో పరిమితమైన నేత కాదని, యావత్ దేశంపై ఆయన ముద్ర ఉందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలకు అతీతంగా ఆయన అభిమానులున్నారన్నారు. 2న పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, మండలంలో వైఎస్ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.