
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబే అసలు ముద్దాయని, చార్జిషీట్‌లో తక్షణమే ఆయన పేరు చేర్చి అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చండీగఢ్ ఫోరెన్సిక్ లేబొరేటరీ స్పష్టమైన ఆధారాలిచ్చినా చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ చంద్రబాబుదేనని దేశమంతా నమ్ముతోందని, ఈ కేసులో ఆయనకు శిక్ష పడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్నారు.
మూడేళ్లపాటు మూలన పడేసిన ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసిందని, అయితే ఇది చంద్రబాబును రక్షించేందుకు కాదనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విచారణ వైపు వెళ్లకుండా చేసే లక్ష్యంతో కాకుండా, చిత్తశుద్ధితో కేసులో భాగస్వామ్యులైన వారికి శిక్షలు పడేలా చూడాలని కోరారు. చంద్రబాబుని ఆ దేవుడు కూడా రక్షించలేరంటూ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రతిజ్ఞను ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. చంఢీగడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు.
దొంగ పట్ల ఉదాశీనతా..!
ఒక ఎమ్మెల్యేను కొనేందుకు రూ.5 కోట్లకు బేరమాడి, 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా కూడా కేసులు పెట్టకపోవడం అన్యాయన్నారు. ఇది కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించేలా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబును ముద్దాయిగా చేర్చి అరెస్టు చేయాలన్నారు. లేకుంటే ప్రజల్లో సామాన్యుడికి ఒకన్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా? అన్న అభిప్రాయం కలుగుతుందన్నారు. చంద్రబాబు అవినీతి 15 ఏళ్ల క్రితమే వెలుగు చూసిందని, అప్పట్లో తెహల్కా ఆయన అత్యంత అవినీతి పరుడని నిగ్గుతేల్చిందని భూమన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా విచారణ జరగకపోతే.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. తనకు అనేక మంది అండదండలున్నాయంటూ చంద్రబాబు అవినీతిని ఏరులై పారిస్తాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment