పాలన వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న అశేష ప్రజానీకం
పాలనా వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాల అభివృద్ధి సాధ్యమని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో 20 వేల మందికి పైగా ప్రజలు మహా ప్రదర్శన నిర్వహించి పాలనా వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం, గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతమైన పెనుమాక, పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్ర ప్రజల మనోగతానికి అనుగుణంగా వికేంద్రీకరణ చేపట్టాలని.. ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని గాలికొదిలేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అమరావతి పేరిట చేస్తున్న కపట నాటకాలు ఆపాలని.. రాష్ట్ర సమతుల అభివృద్ధిని అడ్డుకోజూస్తున్న ప్రతిపక్షాలు ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
తిరుపతి సెంట్రల్/పీలేరు: ‘కేంద్రీకరణ వద్దే వద్దు.. పాలనా వికేంద్రీకరణే ముద్దు’ అంటూ సోమవారం తిరుపతిలో మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20 వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చి తమ ఆకాంక్షను గళమెత్తి వినిపించారు. సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్ జగన్ ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోగతానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం అమరావతిలో ఐదు వేల మంది కోసం అన్ని ఊర్లూ తిరుగుతున్నారు. తిరుపతిలో రెండ్రోజుల కిందట చంద్రబాబు జోలె పట్టి భిక్షాటన చేసినా 8 వందల మంది కూడా హాజరు కాలేదు. అదే వికేంద్రీకరణ కోసం ఈ రోజు ఎవరూ పిలుపు ఇవ్వకుండానే 20 వేలకు పైగా జనం తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి’ అన్నారు. ఎంపీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కుర్చీ కోసమే చంద్రబాబు ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వికేంద్రీకరణ కోరుతూ భారీ ప్రదర్శన జరిగింది. మద్దతుగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘పశ్చిమ’లో సంఘీభావ ర్యాలీ
బుట్టాయగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతమైన బుట్టాయగూడెంలో వికేంద్రీకరణ కోరుతూ ర్యాలీ జరిగింది. మహిళలు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చి నెహ్రూ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. మద్దతుగా పాల్గొన్న ఏపీ శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందన్నారు. రాజధాని ప్రాంతంలో బినామీలతో భూములు కొనుగోలు చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక రాజధాని వద్దే వద్దు
శ్రీకాకుళం: ఒక రాజధాని వద్దే వద్దని.. పాలనా వికేంద్రీకరణే ముద్దు అని శ్రీకాకుళం జిల్లా వాసులు నినదించారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. రాజాంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొని మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరారు. వీరఘట్టంలో డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించారు. కోటబొమ్మాళిలో వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు.
అమరావతిలో కదం తొక్కిన ప్రజలు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పాలనా వికేంద్రీకరణ చేపట్టాలంటూ అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి మండలం పెనుమాకలో వివిధ వర్గాల ప్రజలు కదం తొక్కారు. సోమవారం పెనుమాక నుంచి తాడేపల్లి భరతమాత సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. దీనికి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), వైఎస్సార్‌సీపీ నాయకులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, యడ్ల సాయికృష్ణ, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, సంపూర్ణ పార్వతి, సంకె సునీత, దర్శి విజయశ్రీ, లక్ష్మీరోజాతోపాటు, వివిధ ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎమ్మెల్యేను, ఇతర నాయకులను విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన 90 మందిపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి మోసగాడని, ఆయన్ని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. రాజధాని పేరిట రైతుల నుంచి భూములు తీసుకుని ఐదేళ్లలో ఎలాంటి న్యాయం చేయని చంద్రబాబు ఇప్పుడు మాత్రం న్యాయం చేస్తాడనుకోవడం పొరపాటు అన్నారు.
చంద్రబాబు శాశ్వతంగా అడుక్కోవడమే : మంత్రులు పేర్ని, కొడాలి
సాక్షి, మచిలీపట్నం: ‘ఒకే రాజధాని వద్దు.. వికేంద్రీకరణే ముద్దు’ అని నినదిస్తూ మచిలీపట్నం వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు జాతీయ జెండాలు చేతబూని కోర్టు జంక్షన్ నుంచి కోనేరు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి కోసం జోలె పట్టుకుని దొంగనాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని పేరిట చేస్తున్న కృత్రిమ ఉద్యమాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబుకు శాశ్వతంగా అడుక్కుతినే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బందరు పోర్టు ఉద్యమంలో రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అమరావతి రైతుల కోసమంటూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌బాబు, కైలే అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
వికేంద్రీకరణే ముద్దు
విజయనగరం: పాలన వికేంద్రీకరణకు మద్దతుగా విజయనగరం జిల్లాలో పలుచోట్ల సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు సాగాయి. ఒకచోట వద్దు.. మూడు చోట్ల రాజధానుల ఏర్పాటే మంచిదంటూ నినదించారు. గజపతినగరం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీకి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిని మార్చాలంటూ కలెక్టరేట్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి దళిత, బీసీ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
విజయనగరం జిల్లా గజపతినగరంలో..
సీమ ద్రోహి బాబు
పెనుకొండ (అనంతపురం): పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జిల్లా పెనుకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘రాయలసీమ ద్రోహి చంద్రబాబూ గో బ్యాక్’ అంటూ నినదించారు. వికేంద్రీకరణ చేపట్టాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ సోదరుడు మల్లికార్జున పాల్గొని మద్దతు పలికారు.
అనంతపురం జిల్లా పెనుకొండలో ..
విశాఖలో కాగడాల ప్రదర్శన
సీతమ్మధార (విశాఖ): రాష్ట్ర పరిపాలన రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గురుద్వార్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మద్దతుగా పాల్గొన్న పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ప్రజలే తరిమికొడతారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కేకే రాజు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించటంపై ఉత్తరాంధ్ర ప్రజలు సంబరాలు జరుపుకుంటుంటే అయ్యన్నపాత్రుడు లాంటి నాయకులు విమర్శలు చేయటం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment