
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను చంద్రబాబు కోరుతున్నారని.. నిజంగా అమరావతిపై ఆయనకు ప్రేమ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే..
అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ 30 వేల ఎకరాలు రాజధానికి కావాలన్నది ప్రభుత్వ భూములు మాత్రమే. డీగ్రేడెడ్ ఫారెస్టు ల్యాండ్ తీసుకోవాలని వందసార్లు చెప్పినా బాబు బుర్రకెక్కలేదు. రైతుల మెడ మీద కత్తి పెట్టి ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్రబాబు ఆడిన డ్రామాకు ఏనాడూ వైఎస్సార్‌సీపీ మద్దతు తెలపలేదు. అమరావతి అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తే బాబుకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయనకు భూములు, వాటి రేట్లు, బినామీ భూములపై లాభాలు తప్ప ప్రజలపై ప్రేమ లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు సిగ్గుతో పార్టీని మూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment