సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీటి విడుదలే ఎజెండాగా ఈ నెల 26న కృష్ణానదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం జరగనుంది. ఈ నెల 24న బోర్డు, త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, నీటి విడుదలపై తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో పూర్తి స్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులతో పాటు ఈఎన్‌సీలు, సీఈలు, ఇతర సభ్యులు హాజరుకానున్నారు.
ఖరీఫ్ అవసరాల కోసం సాగర్ ఎడమ కాల్వ కింద 30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ ఇప్పటికే విన్నవించింది. ఇందులో ఇప్పటికే 3 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు అనుమతి ఇచ్చింది. మిగతా నీటిపై బోర్డు నిర్ణయం చెప్పాల్సి ఉంది. దీనిపై ఏపీతో చర్చించాల్సి ఉంది. ఇక ఏపీ హంద్రీనీవా ద్వారా ఏకంగా రోజుకు ఒక టీఎంసీకి పైగా నీటిని తరలిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుంటోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏపీ నీటిని మళ్లిస్తుండటంపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై బోర్డు ఏపీతో చర్చించాల్సి ఉంది. ఇక మున్ముందు ఇరు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలు, ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటి అంశాలపై బోర్డు ఇరు రాష్ట్రాలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున పూర్తి స్థాయి సమావేశానికి బోర్డు సన్నద్ధమైంది.
26న కృష్ణాబోర్డు సమావేశం
Published Tue, Aug 23 2016 2:32 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement