కృష్ణా, గోదావరి తీరాన వెంకన్న ఆలయాలు
భద్రాచలం మాదిరిగా ఒంటిమిట్ట ఆలయం అభివృద్ధి
తిరుమలలోనే వేయికాళ్ల మండపం నిర్మాణం
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం
తిరుమల: రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున, ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున శాశ్వత ప్రాతిపదికన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. మంగళవారం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డి.సాంబశివరావు నేతృత్వంలో ధర్మకర్తల మం డలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్, ఈవో మీడియాకు వెల్లడించారు. విజ యవాడలోని విద్యాధరపురంలో శ్రీవారి ఆల యాన్ని నిర్మించేందుకు రూ.76 లక్షల విలువైన 843 చదరపు గజాల స్థలాన్ని విశాఖపట్నంకు చెందిన శకుంతలాదేవి ఇటీవల విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ కోట్లలో ఉంటుందని ఈవో తెలిపారు.
మరికొన్ని ప్రధాన తీర్మానాలు
వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని ప్రభుత్వం టీటీడీలో విలీనం చేస్తూ ఇటీవల తీర్మానం చేసింది. ఆమేరకు ఆలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అక్కడ సీతారామలక్ష్మణ స్వామితోపాటు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు.
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపం పునఃనిర్మాణం చేయనున్నారు. ఇందులో భాగంగా డిజైన్ల రూపకల్పనపై చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు కె.రాఘవేంద్రరావు, పలువురు సభ్యు లు, అధికారులతో కమిటీ నియమించారు.టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే పీసీఏ (యాత్రికుల పరిహార భత్యం) రూ. 1,500 నుంచి రూ. 2,500కి పెంచుతూ నిర్ణయించారు.
రూ.9.8 కోట్లతో తిరుపతిలోని మొదటి, రెండో సత్రాల అభివృద్ధి చేయనున్నారు.
రూ. 72 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి సేవా సదన్‌ల నిర్మాణ పనులకు అనుమతి.
రూ. 59 లక్షల విలువైన 128 కేజీల వెండితో గోవిందరాజస్వామి ఆలయంలోని పీఠాలకు తాపడం పనులు చేస్తారు.
రూ. 25 లక్షలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు ఆమోదం తెలిపారు.
రూ. 1.57 కోట్లతో 2.5 లక్షల రవికె గుడ్డలు, రూ. 1.52 కోట్లతో 1.75 లక్షల కేజీల కంది పప్పు, రూ. 73 లక్షలతో 1.08 కేజీల చింతపండు, రూ. 3.66 కోట్లతో 2.5 కోట్ల పాలిథిన్ సంచులు, రూ. 1.92 కోట్లతో 22 లక్షల కొబ్బరికాయలు కొనుగోలు చేయనున్నారు.
రూ. 7.45 కోట్ల ఖర్చుతో తిరుమలలో హౌస్‌కీపింగ్, శానిటేషన్ పనుల నిర్వహణకు ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు రెండేళ్ల కాలపరిమితితో అనుమతి.