'జరిగిందేమిటో ప్రపంచానికంతా తెలుసు'
న్యూఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికంతా తెలుసునని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన స్పష్టం చేశారు. టీటీడీపీ నేతలకు పనిలేక, ఏం చేయాలో పాలుపోక తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో గురువారం న్యూఢిల్లీలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ బేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్లో శాంతిభద్రతలు చాలా బాగున్నాయని... అందరూ కలసి ఉన్నారని వెల్లడించారు.
ఆగస్టులో స్మార్ట్ సిటీలపై అంతర్జాతీయ సదస్సుకు వెంకయ్యనాయుడును ఆహ్వానించామని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం ప్రారంభించిన డబల్ బెడ్ రూమ్ పథకానికి కేంద్ర సాయం అందించాలని కోరామని చెప్పారు. తెలంగాణలో 12 క్లాస్ ఒన్ సిటీలకు ప్రతిపాదనలు పంపామని... ఆ జాబితాలో సిద్ధిపేట కూడా చేర్చాలని వెంకయ్యనాయుడును ఈ సందర్భంగా కోరామని కేటీఆర్ తెలిపారు.