
కులభూషణ్‌కు ఉరి: అమెరికా వార్నింగ్!
భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధంచడంపై...
వాషింగ్టన్: భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధంచడంపై అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను ఏకాకిగా నిలబెట్టాలన్న భారత్ దౌత్య చర్యలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చేందుకే దాయాది ఈ చర్యకు దిగి ఉంటుందని వారు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం లైఫ్ సోపర్ట్ మీద ఉన్న భారత్-పాక్ సంబంధాలు మరింత దెబ్బతినవచ్చునని, ఇరుదేశాల మధ్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి.. రానున్న రోజలు మరింత అంధకారమయంగా మారిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.
గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారత్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే ఉరిశిక్ష అమలు చేయబోమంటూ పాక్ వెనుకకు తగ్గింది. అయితే, గుఢచర్యం, జాతి వ్యతిరేక కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కులభూషణ్‌పై విచారణ ఆదరాబాదరాగా చేయడం, తగినంతగా ఆధారాలు లేకుండానే ఆయనకు శిక్ష విధించడాన్ని అమెరికాకు చెందిన దక్షిణ, మధ్య ఆసియా బ్యూరో మాజీ సీనియర్ అధికారి అలిస్సా అయ్‌రెస్ తప్పుబట్టారు. ఒకవైపు కులభూషణ్‌పై విచారణను వేగంగా చేపట్టిన పాక్.. మరోవైపు ముంబై దాడుల కేసులో తమ దేశంలో జరుగుతున్న విచారణను నిత్యం వాయిదాలతో జాప్యం చేస్తుండటంపై విస్మయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రముఖ మేధోసంస్థ అయిన విదేశీ సంబంధాల మండలిలో భారత్, పాకిస్థాన్, దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ ఫెల్లో ఆమె ఉన్నారు.
సరైన ఆధారాలు లేకుండా రాజకీయ ప్రేరేపణతోనే కులభూషణ్‌కు శిక్ష విధించినట్టు కనిపిస్తున్నదని, తమ దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా హెచ్చరించేందుకే పాక్ ఈ చర్యకు పాల్పడినట్టుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక, ప్రస్తుతం భారత్-పాక్ సంబంధాలు లైఫ్ సపోర్ట్ (కొన ప్రాణాధారం) మీద ఉన్నాయని, తాజాగా కులభూషణ్‌కు పాక్‌లో శిక్షతో ఇరుదేశాల సంబంధాలు మరింత క్షీణించి.. చర్చలు పూర్తిగా నిలిచిపోయే అవకాశముందని, రానున్న రోజుల్లో గడ్డుకాలాన్ని ఇరుదేశాల సంబంధాలు ఎదుర్కోబోతున్నాయని మరో విదేశీ వ్యవహారాల నిపుణుడు, ప్రతిష్టాత్మక వుడ్రో విల్సన్ సెంటర్‌లో దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ అసోసియేట్ మైఖేల్ కుజల్మన్ తెలిపారు.