
చంద్రబాబుకు చురక అంటించిన కేవీపీ
న్యూఢిల్లీ: విభజన హామీలు ఎందుకు నెరవేర్చరని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ముఖ్యమైన 10 హామీలను ఇప్పటివరకు నెరవేర్చేదని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హోదాపై ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా చేశారని, వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు అనుమతించాలని కోరారు.
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించిన ఘనత తమదేనని గుండెపై చేయి వేసుకుని చెప్పగలనని కేవీపీ అన్నారు.
ఎక్కువకాలం పాలించిన ప్రతిఒక్కరూ ఉత్తమ పరిపాలకులు కాలేరని, ఔరంగజేబులా చంద్రబాబు ఎక్కువ కాలం పరిపాలించలేరని చురక అంటించారు. వాస్తవాలు మాట్లాడితే తన అనుయాయులతో ఎదురుదాడి చేయిస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఏపీ పోలీసు అధికారుల ప్రకటనలు చూస్తుంటే వారికి రాజ్యాధికారాన్ని అప్పగించారన్న భయం కలుగుతోందన్నారు. విభజన చట్టం హామీల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.