లాలూ, నితీష్ డబుల్ సెంచరీలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అదరగొట్టారు. లాలు దాదాపు 250 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని రికార్డు నెలకొల్పారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమి తరపున లాలూ, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్లు స్టార్ క్యాంపెయినర్లు. నితీష్ కూడా దాదాపు 200కు పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ డబుల్ సెంచరీలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. బిహార్ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. చివరి, ఐదో దశ పోలింగ్ ఈ నెల 5న జరగనుంది. నవంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
'గత వారం లాలు డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించారు. గత నెల రోజులుగా ఆయన 250కి పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. రోజుకు ఆరు నుంచి పది సభల్లో లాలు మాట్లాడారు. ప్రచారానికి రావాలని లాలూను మహాకూటమి అభ్యర్థులు కోరారు. ఆయనకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది' అని ఆర్జేడీ నేత చంద్రేశ్వర్ ప్రసాద్ సింగ్ చెప్పారు. గతేడాది లాలు గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నా.. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. లాలు కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే సోనియా గాంధీ 6, రాహుల్ గాంధీ 15 సభల్లో పాల్గొన్నారు.
ఇక ఎన్డీయే తరపున బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ 200కు కాస్త తక్కువగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జీతన్ రామ్ మంజీ 150కి పైగా ర్యాలీల్లో ప్రసంగించారు. ఎన్డీయే కూటమి స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ 25 ర్యాలీల్లో పాల్గొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎక్కువ ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీయే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ దాదాపు చెరో వంద ర్యాలీల్లో ప్రసంగించారు.