గతవారం బిజినెస్ | Last week, the Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Mar 28 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

Last week, the Business

మొబైల్ బ్యాంకింగ్‌లో ఎస్‌బీఐ టాప్

 
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల మార్కెట్‌లో 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. గతేడాది డిసెంబర్‌కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం పరిమాణంపరంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 38.44 శాతం, విలువ పరంగా సుమారు 36 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొంది. డిసెంబర్‌లో రూ. 17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఎస్‌బీఐ వివరించింది.

 
డిసెంబర్ త్రైమాసికం క్యాడ్ 1.3 శాతం

కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రై మాసికంలో (అక్టోబర్- డిసెంబర్) 1.3 శాతంగా నమోదయ్యింది. 2014-15లో ఈ రేటు 1.5 శాతం. ఇటీవల నెలల్లో దిగుమతులు తగ్గి వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) తక్కువగా నమోదవుతుండడం కరెంట్ అకౌంట్ లోటు తగ్గడానికి ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ మారక నిధులు, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకపు నిధుల మధ్య నికర వ్యత్యాసమే (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) కరెంట్ అకౌంట్ లోటు.

 
ఎలక్ట్రానిక్స్ తయారీలోకి రూ.లక్ష కోట్లు

భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. 2014 వరకూ రూ.11,700 కోట్లుగా ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.28 లక్షల కోట్లకు పైగా పెరిగాయని తెలిపారు.

 
వాల్‌మార్ట్‌ను దాటనున్న అలీబాబా

ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న అమెరికా సంస్థ వాల్‌మార్ట్‌ను..  చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా త్వరలోనే అధిగమించగలదనే అంచనాలు నెలకొన్నాయి. మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 463.3 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ పరిమాణం సాధిస్తామని ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ తెలిపింది. జనవరి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాల్‌మార్ట్ నమోదు చేసిన 478.6 బిలియన్ డాలర్ల నికర అమ్మకాలకు ఇది దాదాపు సమీపంలో ఉండటం గమనార్హం.

 
ప్రభుత్వ రుణ భారం రూ.55 లక్షల కోట్లు

ప్రభుత్వ రుణ భారం డిసెం బర్ నాటికి రూ.55.26 లక్షల కోట్లకు చేరింది. త్రైమాసికంగా చూస్తే 3 శాతం పెరిగింది. రుణ నిర్వహణకు సంబంధించి ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ వివరాలను తెలియజేసింది. మొత్తం రుణంలో అంతర్గత రుణ భారం వాటా త్రైమాసికంగా చూస్తే... 92 శాతం నుంచి 92.2 శాతానికి ఎగసింది.

 
మహీంద్రా నుంచి ‘సబోరో’ పాలు

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) గ్రూప్ తాజాగా డెయిరీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌లో భాగమైన వ్యవసాయోత్పత్తుల విభాగం ‘సబోరో’ బ్రాండ్  కింద పాల ప్యాకెట్లను ఆవిష్కరించింది. ఇవి నాలుగు వేరియంట్లలో (క్రీమ్ రిచ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ప్రొటీన్ రిచ్ మిల్క్) లభిస్తాయని ఎంఅండ్‌ఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఈ పాల విక్రయాలను ముందుగా ఇండోర్‌లో ప్రారంభిస్తున్నామని వివరించారు.

 
మన కరెన్సీ నోటుకు మన కాగితమే

మన కరెన్సీ నోటుకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారు చేసుకోనున్నాం. దీని వల్ల ప్రతి ఏడాది వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు ఉపయోగించే కాగిత తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఏడాదికి 12వేల మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల ప్రతి ఏడాది రూ.1,280 కోట్ల విదేశీ మారక ం మిగులుతుందని బీఆర్‌బీఎన్‌ఎంఎల్ పేర్కొంది.


ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయం!
నష్టాల్లో కూరుకుపోయిన ప్రభు త్వ రంగ సంస్థ ఎయిరిండియాలో 49 శాతం దాకా వాటాలను విక్రయించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందుకోసం నలుగురైదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా చిట్టచివరిసారిగా 2007లో లాభాలు చూసింది.

 
ఇన్ఫీబీమ్ ఐపీఓకు 1.1 రెట్లు సబ్‌స్క్రిప్షన్

ఇన్ఫీబీమ్ ఇన్‌కార్పొరేషన్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.1 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. భారత్‌లో ఐపీఓకు వచ్చిన తొలి ఈ కామర్స్ కంపెనీ ఇది. ఈ ఐపీఓ ద్వారా రూ.450కోట్లు సమీకరించాలని ఇన్ఫీబీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓకు రూ.360-432 ను ధరల శ్రేణిగా కంపెనీ నిర్ణయించింది. 1.25 కోట్ల షేర్లకు గాను 1.37 కోట్ల షేర్ల బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)లకు కేటాయించిన వాటా 86 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగేతర ఇన్వెస్టర్ల కేటగిరి వాటా 2.23 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

 
ఆల్ టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు

దేశంలో విదేశీ మారక నిల్వలు గరిష్ట స్థాయికి పెరిగాయి. ఈ నెల 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 2.53 బిలియన్ డాలర్లమేర పెరిగి 355.94 బిలియన్ డాలర్లకు ఎగశాయి. విదేశీ కరెన్సీ ఎసెట్స్ (ఎఫ్‌సీఏ) పెరుగుదల ఫారెక్స్ నిల్వల వృద్ధే ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది.

 
పసిడి రూపంలోనే రీపేమెంటూ : టీటీడీ

దీర్ఘకాలానికి తాము గోల్డ్ డిపాజిట్ పథకం కింద దీర్ఘకాలానికి తాము జమ చేసే పసిడిని బ్యాంకులు తిరిగి అదే రూపంలో ఇవ్వాలని, నగదు రూపంలో తమకొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటోంది. ఇందుకోసం నిబంధనల్లో తగు మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక బంగారం డిపాజిట్లపై అసలు, వడ్డీని పసిడి రూపంలోనే ఇచ్చేలా సంబంధిత స్కీములో సవరణలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి రాసినట్లు టీటీడీ ఈడీ డి. సాంబశివరావు తెలిపారు.

 
మళ్లీ పెరగనున్న హోండా కార్ల ధరలు!

హోండా కార్ ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రూ.6,000 వరకూ పెంచాలని యోచిస్తోంది. ప్రతికూలమైన ఎక్స్ఛేంజ్ రేటు ప్రభావం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలను పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. వచ్చే నెల నుంచి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఏఏ మోడల్ ధరలను ఎంతెంత పెంచాలన్న విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

 
ఐపీఓ ప్రణాళికల్లో టాటా స్కై

డీటీహెచ్ సర్వీసులు అందించే టాటా స్కై దాదాపు రూ. 2,000 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సన్నద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు కంపెనీ ఇన్వెస్టర్లు, యాజమాన్యం తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం.టాటా స్కైలో టాటా సన్స్‌కు 51 శాతం, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కి చెందిన ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు 30 శాతం, సింగపూర్‌కి చెందిన టెమాసెక్‌కు 10%, టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌కు 9 శాతం వాటాలు ఉన్నాయి.

 

డీల్స్..
ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌కు భారత్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఎడెల్‌వీజ్ అసెట్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.110 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. శ్రీలంకకు చెందిన బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో 60 శాతం వాటాను హీరో సైకిల్స్ కొనుగోలు చేసింది. దీంతో హీరో సైకిల్స్ కంపెనీ ఆరు నెలల్లో మూడు కంపెనీలను కొనుగోలు చేసినట్లయింది. దీనికి ముందు హీరో సైకిల్స్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన అవోసెట్ స్పోర్ట్స్, ఫైర్‌ఫాక్స్ బైక్స్ కంపెనీలను కొనుగోలు చేసింది. బయోటెక్నాలజీ వ్యాపార సంస్థ అయిన  టెక్నికో ఆగ్రి సెన్సైస్ ఇండియా(టెక్నికో ఇండియా) కంపెనీని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కొనుగోలు చేసింది. టెక్నికో ఆగ్రి సెన్సైస్‌కు చెందిన పూర్తి ఈక్విటీ వాటాను ఆస్ట్రేలియాకు చెందిన టెక్నికో పీటీవై లిమిటెడ్ నుంచి రూ.121 కోట్లకు కొనుగోలు చేశామని బీఎస్‌ఈకి ఐటీసీ నివేదించింది. వాహన విడిభాగాల స్టార్టప్ ‘సెడెమ్యాక్ మెక్‌ట్రానిక్స్’లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని దాదాపు రూ.50 కోట్ల వరకు  పెట్టుబడులు పెట్టారు. టాటా స్టీల్ కంపెనీ స్కాట్లాండ్‌లో ఉన్న రెండు ప్లాంట్‌లను ఆ దేశ ప్రభుత్వానికి విక్రయించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. క్లేడ్‌బ్రిడ్జి, డాల్‌జెల్ స్టీల్ ప్లాంట్లను స్కాట్లాండ్ ప్రభుత్వానికి విక్రయించడానికి ఒప్పందం కుదిరిందని టాటా స్టీల్ తెలిపింది. విండ్ ఎనర్జీ సర్వీస్ ప్రొవైడర్ ఐనాక్స్ విండ్  అనుబంధ కంపెనీ ఐనాక్స్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ తాజాగా ఏపీలోని కొండాపురంలో ఉన్న సరయూ విండ్ పవర్‌ను కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement