లడ్డూ కోసం వస్తే.. లాఠీ దెబ్బలు!
- ఖైరతాబాద్ గణపతి ప్రసాదం కోసం 30 వేల మంది రాక
- సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో క్యూలో తొక్కిసలాట
- లాఠీచార్జి చేసిన పోలీసులు.. పలువురికి గాయాలు
- అదనపు బలగాల రాకతో అదుపులోకి వచ్చిన పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ కోసం ఏకంగా 30 వేల మంది భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. దీంతో పలువురు గాయాలపాలయ్యారు. సకాలంలో అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఉదయం 4 గంటల నుంచే క్యూ..
శుక్రవారం ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు లడ్డూకు పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఆయనకు 50 శాతం లడ్డూ ఇచ్చేందుకు స్థానిక నాయకులు అంగీకరించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని 15 శాతం లడ్డూను లారీలో పెట్టి పంపించారు. మహా ప్రసాదం కోసం ప్రతి ఏటా 5 నుంచి 6 వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి అనూహ్యంగా ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లు నిండిపోవడం, దాదాపు 30 వేల మంది భక్తులు రావడంతో రద్దీ పెరిగిపోయింది.
పోలీసు బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల నుంచి పంపిణీ మొదలైంది. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ భక్తులు ఎగబడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి స్వయంగా అక్కడకు వచ్చి అదనపు బలగాలను మోహరించారు. ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. దీంతో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో లైబ్రరీ పక్కనున్న బారికేడ్లు కూలిపోయాయి. ఈ గందరగోళంలోనే యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు ప్రసాదాన్ని ప్యాకెట్లలో పట్టుకుపోవడం గమనార్హం.
ఆరు వాహనాల్లో లడ్డూ తరలింపు
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లడ్డూ పంపిణీకి డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత్రలో మిగిలిన లడ్డూను ఆరు భాగాలుగా విడగొట్టారు. వాటిని డీసీఎం వాహనాల్లో పెట్టి పోలీసు ఎస్కార్ట్‌తో మంటపం నుంచి తరలించారు. ఈ ప్రసాదాన్ని నగరంలోని వివిధ దేవాలయాల వద్ద ఉంచి పోలీసుల సమక్షంలో స్థానికంగా పంపిణీ చేశారు. ప్రసాదం వద్ద ఎలాంటి తొక్కిసలాట, లాఠీచార్జ్ జరగలేదని, ఊహించని విధంగా భక్తులు రావడమే గందరగోళానికి కారణమైందని కమలాసన్‌రెడ్డి వివరించారు.
ప్రసాదం అమ్ముకోవాల్సిన అవసరం లేదు
ఖైరతాబాద్‌లో లడ్డూ కోసం గలాటా జరుగుతుండగానే తన వాటాగా వచ్చిన లడ్డూను మల్లిబాబు నగర శివార్లలో విక్రయించారంటూ పుకార్లు పుట్టాయి. దీనిపై మల్లిబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రసాదంగా ఇచ్చిన లడ్డూను అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నా వాటాగా వచ్చిన లడ్డూను లారీలో స్వస్థలానికి తరలిస్తున్నాం. లారీ వెంట నా బంధువు రామకృష్ణ ఉన్నారు. లడ్డూను లారీలోకి ఎక్కించడం కోసం స్థానికంగా 10 మంది కూలీలను మాట్లాడుకున్నాం.
వీరిని దారి మధ్యలో దింపాల్సి ఉన్నా.. లారీ ఆపేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో నగర శివార్ల వరకు వారిని తీసుకెళ్లాం. శివారుల్లో లారీ దిగిన కూలీలకు నా బంధువు రూ.2 వేలు చెల్లించారు. ఈలోపు ఎస్కార్ట్ పోలీసులు, వారి వెనుక స్కోడా కారులో వచ్చి మంత్రి సోదరుడిగా చెప్పుకున్న వ్యక్తి ప్రసాదంలో చాలా భాగం కవర్లలో వేసుకున్నారు. ఇది చూసిన ఓ మీడియా ఛానల్ విషయం తెలియక తప్పుగా ప్రసారం చేసింది’ అని పేర్కొన్నారు.