ఎనీటైమ్‌.. క్యాష్‌ కొంచెమే.. | Limited cash to markets, ATM centers will compression | Sakshi
Sakshi News home page

ఎనీటైమ్‌.. క్యాష్‌ కొంచెమే..

Published Sat, Mar 25 2017 2:36 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

ఎనీటైమ్‌.. క్యాష్‌ కొంచెమే..

ఎనీటైమ్‌.. క్యాష్‌ కొంచెమే..

వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది.

- ఏటీఎం కేంద్రాల కుదింపు.. పరిమితంగా నగదు
- రూ.10 వేల ‘డ్రా’కే పరిమితం చేసే యోచనలో రిజర్వు బ్యాంకు
- ఇప్పటికే బ్యాంకులకు మౌఖిక ఆదేశాలు.. కొత్త ఏటీఎంల ఏర్పాటు వద్దని సూచన
- ఖాతాదారులను డిజిటల్‌ వైపు మళ్లించాలంటున్న ఆర్‌బీఐ.. ప్రైవేటు బ్యాంకులే తొలి టార్గెట్‌!
- ఏప్రిల్‌ రెండో వారంలో స్పష్టత వస్తుందంటున్న బ్యాంకర్లు
- గత ఐదు మాసాలుగా పనిచేయని ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎంలెన్నో!  


సాక్షి, హైదరాబాద్‌

వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేదాకా ఏటీఎంల్లో నగదును నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు ఉంచాలని ఫిబ్రవరి రెండో వారంలోనే సూచించినట్లు సమాచారం. అందువల్లే ఫిబ్రవరి చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. అక్కడక్కడా ఏటీఎంలలో నగదు పరిమితంగా లోడ్‌ చేస్తుండటంతో గంటలోపే ఖాళీ అవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు పరిస్థితి కాస్త కుదురుకున్నాక.. ఫిబ్రవరి చివరి వారం దాకా ఏటీఎంల్లో నగదుకు పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు.

అయితే ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితిని ఎత్తేస్తున్నామని ప్రకటించిన రిజర్వు బ్యాంకు... వాటికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని, అప్పటిదాకా ఏటీఎంల్లో నగదు ఉంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లకు అంతర్గతంగా సూచించింది. ఈ మేరకు బ్యాంకులు వాటికి అనుబంధంగా ఉండే ఏటీఎంలలోనూ డబ్బు లోడ్‌ చేయడం లేదు. ఆర్‌బీఐ లైసెన్స్‌ ఉండే ఏజెన్సీలు కూడా కొంతకాలంగా ఏటీఎంల్లో నగదు లోడ్‌ చేయడం లేదు. ఫలితంగా ఖాతాదారులు ప్రతి చిన్న అవసరానికి బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది.

పరిమితి రూ.10 వేలు?
ప్రస్తుతం సేవింగ్స్‌ ఖాతాదారులకు వారి ఖాతా నిర్వహణను బట్టి రూ.40 వేల నుంచి రూ.1.5 లక్షల దాకా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు గరిష్టంగా రూ.లక్షకు పరిమితం చేసినా ప్రైవేటు బ్యాంకులు రూ.1.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశమిచ్చాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు దానిని రూ.10 వేలకు కుదించే అవకాశముంది. ఖాతాదారులెవరైనా రోజు రూ.10 వేలు మాత్రమే ఏటీఎంల నుంచి తీసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు త్వరలో వెలువడతాయని, అప్పటిదాకా ఏటీఎంలలో డబ్బు లోడ్‌ చేయడంపై నియంత్రణ అమల్లో ఉందని ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘నోట్ల రద్దు’సమయంలో అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాకు ఎక్కువగా తోడ్పడిన ఎస్‌బీఐ ఏటీఎంలు ఇప్పుడు అసలు పనిచేయక పోవడం గమనార్హం. కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు నింపుతున్నారు. మరోవైపు ఏటీఎంలలో నగదు కొరత, బ్యాంకు శాఖల్లో ఉచిత లావాదేవీలపై పరిమితి నేపథ్యంలో తమ వద్ద ఉన్న నగదు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ఖాతాదారులు వెనుకడుగు వేస్తున్నారు.

డిజిటల్‌ వైపు మళ్లించడానికే..
ఖాతాదారులను డిజిటల్‌ వైపు మళ్లించడానికే ఆర్‌బీఐ ఈ ఆంక్షలు విధిస్తోందని... ఏప్రిల్‌ రెండో వారంలో దీనిపై స్పష్టత వస్తుందని ప్రైవేట్‌ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక ఏటీఎంల కారణంగా తక్కువ సిబ్బందితో బ్రాంచీలను నెట్టుకొస్తున్నామని.. ఇప్పుడు ఖాతాదారులంతా బ్యాంకులకు వస్తే సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సి వస్తుందని, ఇది భారంగా మారుతుందని యాక్సిస్‌ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. రూ.10 వేలు అంతకంటే ఎక్కువ నగదు అవసరమయ్యేవారు బ్యాంకులకు రావడం మొదలుపెడితే తమ కౌంటర్లను పెంచుకోవాల్సి వస్తుందని సిండికేట్‌ బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఐదు నెలలుగా పనిచేయని ఏటీఎంలు ఎన్నో..
నోట్ల రద్దు అనంతరం నవంబర్‌ పదో తేదీ తరువాత నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి సుమారు 1,500 ఏటీఎంలు తెరుచుకోనేలేదు. మరో వెయ్యి ఏటీఎంలు పనిచేస్తున్నా... కేవలం బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, క్రెడిట్‌కార్డు, ఇతర బిల్లులు చెల్లించడం వంటి సేవలకే పరిమితం అవుతున్నాయి. దీంతో అనవసరంగా వేలకు వేలు అద్దె చెల్లించడం కంటే వాటిని మూసేయడమే మేలని భావిస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏప్రిల్‌ రెండో వారం నాటికి రిజర్వుబ్యాంకు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడితే దానికి తగ్గట్టుగా చర్యలు చేపడతామని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement