అద్వానీది ధర్మాగ్రహం
Published Sun, Sep 15 2013 2:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి.. పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఆగ్రహానికి గురైన బీజేపీ నాయకత్వం ఆయనను చల్లార్చడానికి తంటాలు పడుతోంది. అద్వానీది ధర్మాగ్రహమేనని, ఆయనను శాంతింపజేస్తానని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదని అద్వానీ ఎప్పుడూ చెప్పలేదని శనివారమిక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. ‘అద్వానీకి ఆగ్రహించే హక్కు ఉంది. పార్టీ నేతలో లోపాలుంటే మమ్మల్ని తిట్టి, మందలించే హక్కు ఆయకుంది. అయితే దీన్ని మాలో విభేదాలున్నట్లు అర్థం చేసుకోకూడదు. అద్వానీ ఇకపైనా మాకు నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఉంటారు.
ఆయన ఒంటరి కాదు’ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం, దీనిపై అద్వానీ మండిపడి రాజ్‌నాథ్ వ్యవహార శైలిని దుయ్యబడుతూ లేఖ రాయడం తెలిసిందే. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. అద్వానీకి బదులిచ్చేంత స్థాయి తనకు లేదన్నారు. ‘కుటుంబంలో పెద్దదిక్కు తిట్టినంత మాత్రాన కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు కాదు’ అని పేర్కొన్నారు. ఈ నెల 25న భోపాల్‌లో జరిగే ర్యాలీలో అద్వానీ, మోడీలు వేదిక పంచుకుంటారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, మిత్రపక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు 272 సీట్లకు పైగా వస్తాయన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కొత్త మిత్రులతో పొత్తు పెట్టుకునే అవకాశముందని పేర్కొన్నారు. మోడీ సీఎంగానే ఉంటారా లేకపోతే లోక్‌సభకు పోటీ చేస్తారా అని విలేకర్లు అడగ్గా.. సీఎంలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం లేదన్నారు. ఆరెస్సెస్ ఒత్తిడి వల్లే మోడీని ప్రధాని రేసులో నిలిపామనడం సరికాదని పేర్కొన్నారు.
నేడు హర్యానాలో మోడీ ర్యాలీ..
మోడీ ఆదివారం హర్యానాలోని రేవాలో జరిగే మాజీ సైని కుల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఎన్ని కైన తర్వాత ఆయన ప్రసంగించనుండడం ఇదే తొలిసారి.
Advertisement