రాజ్‌నాథ్ సింగ్: ప్రభుత్వంలో నెంబర్ 2
న్యూఢిల్లీ: రాజ్‌నాథ్ సింగ్.. నరేంద్రమోడీ ప్రభుత్వంలో నెంబర్ 2 గా పరిగణించగల నేత. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్వానీ లాంటి సీనియర్లు వ్యతిరేకించిన సమయంలో మోడీకి అండగా నిలిచిన వ్యక్తి. మోడీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితుడైన సహచరుడు. హిందూత్వవాది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గట్టి మద్దతుదారు.
రాజ్‌నాథ్ రాజకీయ ప్రస్థానం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌తోనే ప్రారంభమైంది. 13 ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. పీజీ పూర్తిచేసి లెక్చరర్‌గా చేరినా.. ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం వదులుకోలేదు. విద్యార్థిగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో పనిచేశారు. 1974లో భారతీయ జనసంఘ్ మీర్జాపూర్ శాఖకు కార్యదర్శి అయ్యారు. 1975 నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకిస్తూ జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. బీజేవైఎం కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1983లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. యూపీలోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1999లో వాజ్‌పేయి మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2000లో యూపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, 2002 వరకు కొనసాగారు. అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యారు. ప్రస్తుతం లక్నో ఎంపీగా ఉన్నారు.
పుట్టిన తేదీ: జులై 10, 1951
వయసు: 63 ఏళ్లు
స్వస్థలం: భాబౌర గ్రామం, చందౌలీ జిల్లా, యూపీ
విద్యాభ్యాసం: ఎమ్మెస్సీ(ఫిజిక్స్), గోరఖ్‌పూర్ వర్సిటీ
కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె