'ప్రధాని మోడీ' కి అద్వానీ అడ్డంకి?
- ఇప్పుడప్పుడే ప్రకటించొద్దంటూ పట్టు
- నచ్చజెప్పేందుకు రాజ్‌నాథ్ విఫలయత్నం
- రంగంలోకి ఆరెస్సెస్.. మోడీకి పచ్చజెండా!
- 13, లేదా 16న బీజేపీ పార్లమెంటరీ భేటీ
- మోడీనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘అద్వానీ అడ్డంకి’ ఇప్పట్లో తొలిగేలా కన్పించడం లేదు. మోడీని ఇప్పటికిప్పుడు బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న పార్టీ పెద్దల ప్రయత్నాలను అద్వానీ గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో అద్వానీని ఒప్పించేందుకు బుధవారం స్వయానా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆయన నివాసానికి వెళ్లి అరగంట పాటు చర్చించినా లాభం లేకపోయింది. మోడీని ప్రధాని అభ్యర్థి చేయాలన్న ఆరెస్సెస్ మనోగతాన్ని ఎంతగా వివరించినా అద్వానీ పట్టు వీడకపోవడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారంటున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కూడా అద్వానీని ఒప్పించేందుకు మంగళవారం ఆరెస్సెస్ తరఫున విఫలయత్నం చేయడం తెలిసిందే. 2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీని వీలైనంత త్వరగా రంగంలోకి దించజూస్తున్న ఆరెస్సెస్ పెద్దలకు ఈ పరిణామం అస్సలు రుచించడం లేదని సమాచారం. బీజేపీలోని మోడీ సమర్థకులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
శుక్రవారం గానీ, లేదంటే కనీసం 16వ తేదీ లోపు గానీ బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డు సమావేశాన్నిఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అంతగా అయితే భేటీ ఎప్పుడు జరగాలన్నది అగ్ర నేత హోదాలో అద్వానీయే నిర్ణయించవచ్చని, అంతే తప్ప మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇంకెంత మాత్రమూ ఆలస్యం జరగరాదని అంటున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకి సెప్టెంబర్ 19 లోపు ఏదో ఒక తేదీని ఖరారు చేసే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఆరెస్సెస్ నేత రామ్‌లాల్‌కు అప్పగించారు. ప్రధాని అభ్యర్థిగా మోడీని వీలైనంత త్వరగా ప్రకటించాలని ఆరెస్సెస్ కూడా కృతనిశ్చయంతో ఉన్నందున దాన్ని అద్వానీ ఇంకెంతో కాలం అడ్డుకోలేకపోవచ్చని భావిస్తున్నారు. బహుశా వచ్చే పార్లమెంటరీ బోర్డు భేటీలోనే ఈ మేరకు నిర్ణయం వెలువడవచ్చన్నది పరిశీలకుల అంచనా. అద్వానీని ఒప్పించేందుకు ఆరెస్సెస్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే విషయమై బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషీ తదితరులు కూడా సుముఖంగా లేరని సమాచారం. కనీసం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్నందున అవి పూర్తయేదాకా వేచి చూడటమే మేలని వారు కూడా భావిస్తున్నారు.
మోడీపై కాంగ్రెస్ ఎన్‘కౌంటర్’
లూధియానా/న్యూఢిల్లీ: నరేంద్ర మోడీకి సంబంధించినంత వరకూ ఆంగ్ల అక్షరమాల ‘ఎఫ్’ అక్షరం నుంచి మొదలై ‘జీ’తో అంతమవుతుందంటూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఎద్దేవా చేసింది. ఎఫ్ అంటే ఫేక్ (నకిలీ) ఎన్‌కౌంటర్ అని, జీ అంటే జెనోసైడ్ (సామూహిక జన హననం) అంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రి మనీశ్ తివారీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు మరో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కూడా... ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ స్వీయ ఘనతనే చాటింపు వేసుకోవడం మోడీ నైజమంటూ దుయ్యబట్టారు. ఏ దారిన పోయే దానయ్యనైనా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే హక్కు చిన్నా పెద్దా పార్టీలన్నింటికీ ఉంటుందంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఎద్దేవా చేశారు.