ఒకే ఒక కార్డు... ఆధార్: జైట్లీ
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీ, పాన్ లాంటి కార్డుల స్థానాల్లో ఆధార్ ఒక్కటే గుర్తింపు కార్డుగా మిగిలిపోయే రోజు రావొచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక బిల్లు, పలు చట్టాలకు 40 సవరణలు చేయడానికి సంబంధించి బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ...‘భవిష్యత్‌లో ఆధార్ ఒక్కటే గుర్తింపు కార్డుగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఇతర దేశాల్లో తలెత్తాయి.
అమెరికాలో సామాజిక భద్రతా సంఖ్య లాంటిదే మన ఆధార్ సంఖ్య’ అని అన్నారు. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు, పాన్ దరఖాస్తుకు ఆధార్‌ను తప్పనిసరిచేయడంపై స్పందిస్తూ...పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడానికే ఈ ఏడాది పన్ను శ్లాబులను తగ్గించామని వెల్లడించారు. ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలు ఉండటం వల్ల అది దుర్వినియోగమయ్యే అవకాశాలు తక్కువేనని తెలిపారు.
యూనివర్సిటీ సర్టిఫికెట్లకూ ఆధార్
ఇకపై విద్యార్థుల సర్టిఫికెట్లకు వారి ఫొటో సహా ఆధార్ నంబర్‌ను జతచేయాలని దేశంలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల యాజమా న్యాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. దీనివల్ల విద్యార్థుల మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లలో భద్రతతో పాటు నకిలీ పత్రాలను అరికట్టవచ్చని యూజీసీ సెక్రటరీ జేఎస్ సంధు తెలిపారు.