‘లార్డ్ ఆఫ్ టన్నెల్స్’ ఆటకట్టు
మెక్సికో సిటీ: సొరంగాలు తవ్వి జైళ్ల నుంచి, గృహ నిర్బంధాల నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం, అమెరికా-మెక్సికో సరిహద్దు మీదుగా మత్తుపదార్థాలను స్మగ్లింగ్ చేయడంలో ఆరితేరిన డ్రగ్ డాన్ జొవాకిన్ లెల్ చాపో గుజ్మన్ ఆటకట్టయింది. ‘ది లార్డ్ ఆఫ్ టన్నెల్’గా పేరొందిన 58 ఏళ్ల గుజ్మన్‌ను మెక్సికో బలగాలు వెంటాడి వేటాడి ఎట్టకేలకు శుక్రవారం అరెస్ట్ చేశారు. గుజ్మన్‌ను అతని స్వస్థలమైన సినాలోవా రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్టు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో విజయగర్వంతో ప్రకటించారు. గుజ్మన్ గత ఏడాది జూలై 11న కట్టుదిట్టమైన భద్రత ఉండే అల్టిప్లానో జైలునుంచి అనూహ్యంగా తప్పించుకున్నాడు.
తన సెల్‌లోని బాత్రూమ్‌లోంచి సొరంగం తవ్వి అందులోంచి తప్పించుకున్నాడు. భూమికి 10 అడుగుల కింద తవ్విన 1.5 కి.మీ పొడవైన సొరంగంలోని పట్టాలపైనుంచి మోటార్ సైకిల్‌పై మరీ తుర్రుమన్నాడు. అమెరికా, మెక్సికో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాయనం తర్వాత గుజ్మన్ తనకు పట్టున్న సినలోవాకు వెళ్లాడు. అక్కడి గుజ్మన్ స్వగ్రామం లాటూనాలో అతని తల్లి నివసిస్తోంది. గత అక్టోబర్‌లో కొండప్రాంతంలో అతడు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. గుట్టల్లో కిందపడిపోవడంతో ముఖానికి, కాలికి గాయాలయ్యాయి. తర్వాత శుక్రవారం లోస్ మోచిస్‌లో మెక్సికో మెరైన్లు, ఆర్మీ జవాన్లు పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి అతన్ని అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హోరాహోరీ కాల్పులు జరిగాయి.