ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి అధికారంలో ఉన్న పార్టీలకు షాకిచ్చింది. గెలుచుకున్న సీట్లలో వ్యత్యాసం కనిపించినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీల పట్ల ప్రజావ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అధికార పార్టీలకు పెద్ద దెబ్బ. అలాగే గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఇదే సరళి కొనసాగింది.
అయితే, ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుచుకున్న సీట్లతోపాటు వాటికి పోలైన ఓట్ల శాతం చూస్తే అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు వచ్చిన సీట్లకు పోలైన ఓట్లకు ఎక్కడా పొంతన లేని ఫలితాలు కూడా వచ్చాయి.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోయి మూడింట రెండొంతుల సీట్లతో విజయకేతనం ఎగురవేసింది. ఈ రాష్ట్రంలో ఎస్పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం వల్ల ఆ రెండు పార్టీలు ఫలితాల్లో ముందుంటాయని తొలిరోజుల్లో అంచనాలొచ్చాయి. ఆ తర్వాత బీఎస్పీ పుంజుకోవడంతో ఒక దశలో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలను మించిపోతుందని కూడా భావించారు. అయితే బీఎస్పీ ఆ స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. యూపీలో బీజేపీ 40 శాతం ఓట్లను సాధించి అఖండ విజయం సాధించగా, ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీలు ఏమాత్రం తమ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ 47 సీట్లు గెలుచుకోగా 21.9 శాతం ఓట్లు సాధించింది. కేవలం 19 సీట్లతో సరిపెట్టుకున్న బీఎస్పీ ఓట్ల విషయంలో ముందంజలో ఉండటం గమనార్హం. బీఎస్పీకి 22.2 శాతం ఓట్లు నమోదయ్యాయి.
యూపీలో పార్టీల వారీగా ఓట్లశాతం..
పంజాబ్ లో అధికార శిరోమణి అకాలీదళ్ (బీజేపీతో కలిసి పోటీ చేసింది) ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావొచ్చు అన్న ప్రచారం జరిగినప్పటికీ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో కూడా సీట్లు గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో గెలువగా, అకాలీదళ్ 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఈ రెండు పార్టీలకు లభించిన ఓట్లను పరిశీలిస్తే... తక్కువ సీట్లు సాధించుకున్న అకాలీదళ్ కు 25.3 శాతం ఓట్లు రాగా, దీనికన్నా ఎక్కువ సీట్లు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి 23.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్లు తక్కువొచ్చి సీట్లు మాత్రం ఎక్కువగా గెలుచుకోవడం గమనార్హం.
పంజాబ్‌లో పార్టీల వారీగా ఓట్లశాతం..
గోవాలో బీజేపీ 13 సీట్లు మాత్రమే గెలుచుకోగా 33.1 శాతం ఓట్లు సాధించుకుంది. అదే కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకున్నప్పటికీ 27.7 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ కన్నా 4 సీట్లు ఎక్కువ గెలుచుకున్నప్పటికీ ఓట్లు మాత్రం తగ్గాయి. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఇక్కడ కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలిచినప్పటికీ ఆ పార్టీకి 12 శాతం ఓట్లు రావడం గమనార్హం.
గోవాలో పార్టీల వారీగా ఓట్లశాతం..
మణిపూర్ లోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలవగా ఆ పార్టీకి 34.5 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించగా ఆ పార్టీకి 36 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎక్కువ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు, తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం.
మణిపూర్‌లో పార్టీల వారీగా ఓట్లశాతం..
ఈ నాలుగు రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాఖండ్ లో మాత్రం ఓట్ల సరళి భిన్నంగానే ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ 57 స్థానాల్లో గెలుపొందగా, 46.5 శాతం ఓట్లు సాధించుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడి కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ కు మొత్తం 33.5 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే అనూహ్యంగా ఏ రాష్ట్రంలో కనిపించని విధంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 10 శాతం ఓట్లు రాబట్టుకోవడం గమనార్హం.
ఉత్తరాఖండ్‌లో పార్టీల వారీగా ఓట్లశాతం..