
డైరెక్టర్ వర్సెస్ డైరెక్టర్.. మాటల వార్!
బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ క్రియేటివ్ దర్శకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.
బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ క్రియేటివ్ దర్శకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. పాకిస్థాన్ నటులపై నిషేధం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించగా.. ఆయన విమర్శలపై మరో టాప్ దర్శకుడు మధుర్ బండార్కర్ మండిపడ్డారు.
పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారన్న కారణంతో కరణ్ జోహర్ తెరకెక్కించిన ’యే దిల్ హై ముష్కిల్’ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన అనురాగ్ కశ్యప్.. 'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్లో అకస్మాత్తుగా పాక్కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ’యే దిల్ హై ముష్కిల్’ ను షూటింగ్ ప్రారంభించారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ అకస్మాత్తుగా కరాచీ వెళ్లి నవాజ్ షరీఫ్ మానవరాలి పెళ్లిలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో ‘యే దిల్ హై ముష్కిల్’ షూటింగ్ ప్రారంభించిన కరణ్.. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయన్న ఉద్దేశంతో పాకిస్థాన్ నటుడ్ని తన సినిమాలో తీసుకున్నారు. అప్పుడు దీనిని ఎవరూ వ్యతిరేకించలేదు. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి, పాకిస్థాన్‌లో భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో పాక్ నటులతో తీసిన భారతీయ సినిమాలను నిషేధిస్తామని ఎమ్మెన్నెస్ ప్రకటించడంతో కరణ్ సినిమాకు చిక్కులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కరణ్‌కు అండగా నిలిచిన అనురాగ్.. ఈ సినిమా నిషేధాన్ని తప్పుబట్టారు.
అయితే, ఈ సినిమా నిషేధం విషయంలో నేరుగా ప్రధాని మోదీపై అనురాగ్ విమర్శలు చేయడాన్ని మధుర్ బండార్కర్ తప్పుబట్టారు. ‘అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు తప్పు. బీజేపీగానీ, ప్రభుత్వంగానీ నిషేధించాలని చెప్పలేదు. ప్రధాని మోదీని విమర్శించడం ట్రెండ్‌గా మారింది’ అని మధుర్ పేర్కొన్నారు.