శశికళకు భారీ ఝలక్: మధు ఔట్!
శశికళకు భారీ ఝలక్: మధు ఔట్!
Published Thu, Feb 9 2017 1:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలన్న ఆశలు శశికళ శిబిరంలో క్రమంగా ఆవిరవుతున్నాయి. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ శశి వర్గం నుంచి జారిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వద్దకు వెళ్లారు. మధుసూదన్‌నను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని అమ్మ తనకు చెప్పినట్లు రెండు రోజుల క్రితం పన్నీర్ సెల్వం మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో మధుసూదన్ కూడా అమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న పన్నీర్ సెల్వం వైపు వచ్చేశారు.
మరోవైపు క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వం వైపు వెళ్లిపోతున్నారు. దాంతో శశికళ వర్గంలో ఆందోళన మొదలైంది. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరూ బయటకు కదలకుండా చూడాలని గట్టి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు బల నిరూపణకు ఆదేశిస్తే మరికొందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వెళ్లిపోతారేమోనన్న గుబులు పుడుతోంది. దీంతో క్యాంపు చుట్టూ పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేస్తున్నారు. అయితే.. శశికళకు విధేయుడిగా ఉంటున్నారన్న అనుమానంతో చెన్నై పోలీసు కమిషనర్ జార్జిపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బదిలీ వేటు వేశారు. అలాగే క్యాంపులో బంధించిన ఎమ్మెల్యేలందరినీ తీసుకురావాలని కూడా డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇవన్నీ తెలిసి శశికళ వర్గంలో నిరాశా నిస్పృహలు మొదలయ్యాయి.
Advertisement