మధ్యప్రదేశ్, మిజోరంలలో నేడే పోలింగ్
భోపాల్/ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో సోమవారం 270 అసెంబ్లీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో మొత్తం 2,583 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 4,64,57,724 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్నీ, విదిష స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ‘అభివృద్ధి’ మంత్రంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత అజయ్ సింగ్ కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఆయన చుర్హత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 142 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన ఎండీఏ మొత్తం 40 స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 6,90,860 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తొలిసారి ప్రింట్ అవుట్ విధానం...
దేశంలోనే తొలిసారిగా మిజోరంలోని 10 నియోజకవర్గాల్లో వీవీపీఏటీ(ఈవీఎం ప్రింట్ అవుట్) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఫలితంగా ఈవీఎంకు అమర్చిన వీవీపీఏటీ మిషన్ల ద్వారా ఓటరుకు తాను వేసిన ఓటుకు సంబంధించి ఓ ముద్రిత ప్రతి అందుతుంది. తద్వారా తాను వేసిన ఓటు సరిగా పడిందో లేదో అప్పటికప్పుడే పరిశీలించుకునే సౌలభ్యం సంబంధిత ఓటరుకు కలుగుతుం ది. నాగాలాండ్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఈసీ ఇప్పుడు మిజోరంలో అమల్లోకి తెస్తోంది.