'మ్యాగీ నూడిల్స్ సురక్షితం'
ముంబై: మ్యాగీ నూడిల్స్ సురక్షితమని పరీక్షల్లో తేలినట్టు నెస్లె ఇండియా సంస్థ ప్రకటించింది. 100 మ్యాగీ శాంపిల్స్ను మూడు ల్యాబరేటరీలలో పరీక్షించగా, ఫలితాల్లో సురక్షితమని తేలినట్టు వెల్లడించింది.
మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ వెల్లడించడంతో నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు ఎత్తేసింది. మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో రసాయనాలు అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది.
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ల్యాబరేటరీల్లో శాంపిల్స్ను పరీక్షించారని, ఈ నివేదికలు తమకు అందాయని నెస్లె సంస్థ ప్రతినిధులు చెప్పారు. మ్యాగీలో రసాయనాలను మోతాదుకు లోపే వాడినట్టు పరీక్షల్లో తేలిందని తెలిపారు. భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, మూడు ల్యాబరేటరీల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొత్త మ్యాగీ న్యూడిల్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు.