మాకు మ్యాగీ నూడుల్స్ తో ఇబ్బందేమీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ లో నెస్లీ ఇండియాకి చెందిన మ్యాగీ న్యూడుల్స్ పై నిషేధం కొనసాగుతుండగా, అమెరికా మాత్రం మ్యాగీ వాడకంపై సానుకూలంగా స్పందిస్తోంది. తాము తాజాగా చేసిన పరీక్షల్లో మ్యాగీలో ఎటువంటి హానికర రసాయనాలు లేనట్లు అమెరికా పేర్కొంది. మ్యాగీ న్యూడుల్స్ లో సీసం శాతం తగినంతగానే ఉన్నట్లు పేర్కొంది. మ్యాగీకి చెందిన అనేక రకాలైన శాంపిల్స్ ను తీసుకుని చేసిన పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైందని యూఎస్ ఎఫ్ డీఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో అమెరికాలో మ్యాగీ అమ్మకాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు ఓ ఈమెయిట్ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మ్యాగీ వాడకం వల్ల తమ ప్రజలు హానికర రసాయనాల బారిన పడుతున్నట్లు తమ ఎఫ్ డీఏ పరీక్షల్లో నిర్ధారణ కాలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా నెస్లీ ఇండియా అనుచిత వ్యాపారాలకు పాల్పడినట్లు భారత్ లో కేసు నమోదైంది. లేబుళ్ల మీద తప్పుడు వివరాలు ఇవ్వడమే కాకుండా తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు చేశారని.. వీటన్నింటి దృష్ట్యా దేశానికి జరిగిన నష్టానికి గాను రూ. 640 కోట్లు కట్టాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆశ్రయించింది.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ ఇలా కేసు పెట్టడం ఇదే తొలిసారి. మ్యాగీ నూడుల్స్లో సీసంతో పాటు ఎంఎస్జీ (మోనోసోడియం గ్లూటామేట్) ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో చాలా రాష్ట్రాలు దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.