విదేశాల్లో మ్యాగీ నూడుల్స్కు క్లీన్చిట్
లండన్: భారత్లో నిషేధానికి గురైన మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాలకు విదేశాల్లో చిక్కులు తొలగిపోతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులకు ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వగా, తాజాగా కెనడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కష్టాల్లో ఉన్న మ్యాగీ ఉత్పత్తుల సంస్థ నెస్లేకిది ఉపశమనం లభించే వార్త. మ్యాగీ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కాదని కెనడా ఆహార తనిఖీ సంస్థ (సిఎఫ్ఐఏ) వెల్లడించింది. మ్యాగీ ఉత్పత్తులను ల్యాబ్లో పరీక్షించిన అనంతరం సిఎఫ్ఐఏ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. సింగపూర్ ప్రభుత్వం కూడా మ్యాగీ నూడిల్స్కు సురక్షితమని ప్రకటించింది. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని, వీటిని తినడం ఎలాంటి హానికరం కాదని బ్రిటన్ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఏ) సర్టిఫికెట్ ఇచ్చింది. భారత్లో తయారు చేసిన ఈ ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ అనుమతించిన స్థాయి మేర ఉన్నాయని పేర్కొంది.
మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. భారత్లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది.