మ్యాగీ నూడుల్స్ మళ్లీ మార్కెట్లో...
100 పట్టణాల్లో విక్రయాలు
తర్వాత దశల వారీగా విస్తరణ
న్యూఢిల్లీ: నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో... దాదాపు అయిదు నెలల తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 100 పట్టణాల్లో దాదాపు 300 మంది పంపిణీదారుల ద్వారా వీటి విక్రయాలు మొదలుపెట్టినట్లు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతానికి మసాలా వేరియంట్‌లో మాత్రమే నూడుల్స్ లభిస్తాయని, త్వరలో మిగతా వేరియంట్ల విక్రయాలు కూడా మొదలవుతాయని నారాయణన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటి ధరలే కొనసాగుతాయన్నారు. పంజాబ్, ఒడిషా, మణిపూర్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో తమ నూడుల్స్ అమ్మకాలకు ఇంకా అనుమతి రాలేదు. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం నిర్దేశిత స్థాయికి మించి ఉందన్న ఆరోపణలపై భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ ఏడాది జూన్‌లో వీటి అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
స్నాప్‌డీల్‌లో ఫ్లాష్ సేల్..
ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్‌లైన్‌లో కూడా విక్రయించనున్నట్లు నారాయణన్ చెప్పారు. స్నాప్‌డీల్ ద్వారా ఫ్లాష్ సేల్ విధానంలో వీటిని విక్రయిస్తున్నట్లు వివరించారు.