అభివృద్ధిలో 6వ స్థానానికి పడిపోయాం!
నాసిక్: మహారాష్ట్రలో ఇంతవరకూ అసమర్ధ పాలనే కొనసాగిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ విమర్శించారు. గత కాంగ్రెస్-ఎన్సీపీల పాలనలో మహారాష్ట్ర అభివృద్ధి వెనుకంజలో పయనించిందని గడ్కారీ ఎద్దేవా చేశారు. గత రాత్రి ఉత్తర మహారాష్ట్రలోని ఎన్నికల సమావేశాలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అసమర్ధ పాలన కారణంగా అభివృద్ధిలో రాష్ట్రం ఆరవ స్థానానికి పడిపోయిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పాలనలో వేలకొద్ది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 10,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎన్సీపీ-కాంగ్రెస్ విధానాలేనని దుయ్యబట్టారు. అందరికీ సాయం, అందరికీ అభివృద్ధి (సబ్ కే సాత్, సబ్ కా వికాస్) అనేది బీజేపీ విధానమని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.