
మాజీ భర్త సొమ్ముతో జల్సాలా.. నటిపై విషం!
- నెటిజన్‌కు దీటుగా బదులిచ్చిన మలైక
బాలీవుడ్ దంపతులు మలైకా అరోరా-అర్భాజ్‌ఖాన్ తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికి ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడిపోవడంపై సోషల్ మీడియాలో చాలా విమర్శలే వచ్చాయి. సెలబ్రిటీ కావడంతో మలైకాకు ఈ విషయంలో ఇప్పటికీ విమర్శలు ఆగడం లేదు. అడపాదడపా పనిలేనివారు ఆమెపై నోరుపారేసుకోవడం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ ఆమెపై విషం చిమ్మాడు. మాజీ భర్త భరణంగా ఇచ్చిన డబ్బుతో ఆమె ఎంజాయ్ చేస్తున్నదని విమర్శించాడు. అతని విమర్శలకు ఏమాత్రం తన హుందాతనం తగ్గకుండా దీటైన సమాధానం ఇచ్చింది మలైకా..
మొదట 'ఫీల్‌గుడ్‌ఫ్యాబ్రిక్' పేరిట ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మలైకాపై విద్వేషపూరిత పోస్టు పెట్టారు. 'ఈ రోజుల్లో కొందరు మహిళలు చేస్తున్న పని ఇదే. సంపన్నుడిని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత పెద్దమొత్తంలో భరణం కోసం విడాకులు ఇవ్వడం.. అలా వచ్చిన సొమ్ముతో జల్సా చేయడం.. మీకు సంపాదించే శక్తి ఉన్నప్పుడు ఎందుకు భరణాన్ని తీసుకుంటారు... లింగబేధాలకు అతీతంగా నేను వ్యక్తులను గౌరవిస్తాను. ఆమె జీవితం ఇప్పుడు పొట్టి దుస్తులు ధరించడం, జిమ్‌లకు, సెలూన్‌లకు వెళ్లడం, విహారాల్లో ఎంజాయ్ చేయడం దీనికి పరిమితమైంది. ఆమెకు ఏదైనా సీరియస్ వర్క్ ఉందా? లేక భర్త ఇచ్చిన సొమ్మును(భరణాన్ని) కరిగిస్తోందా' అని కామెంట్ పెట్టాడు.
ఆ నెటిజన్ కామెంట్‌పై మలైకా స్పందిస్తూ.. 'ఇలాంటి సంభాషణల్లోకి నేను దిగాను. ఇది నా హుందాతనాన్ని తగ్గిస్తుంది. అయినా, నేను నీకు సమాధానమిస్తున్నాను. నా మీద విషం చిమ్మే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. నా గురించి తెలియకుండా విమర్శలు చేయకు. తాపీగా కూర్చుని ఇతరుల జీవితాలపై జడ్జీమెంట్ ఇచ్చేముందు నీ సమయాన్ని ఏదైనా పనిచేసేందుకు వినియోగించు. అది నీకు పనికివస్తుంది' అని మలైకా హితవు పలికింది.