
పైలట్ పై ప్రత్యేక దృష్టిపెట్టిన మలేషియన్ ఎయిర్ లైన్స్
కౌలాలంపూర్ :మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం తప్పిపోయిన ఘటనకు సంబంధించి అక్కడి ప్రభుత్వం పైలట్ పై దృష్టిపెట్టింది. ఈ ఘటన వెనుక పైలట్ పాత్ర ఏమైనా ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పైలట్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా మలేషియన్ విమానం మాయం వెనకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. శాటిలైట్, రాడార్ ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టారు. దీంతో విమానాన్ని హైజాక్ చేసారని అనుమానాలు బలపడుతున్నాయి.
విమానాన్ని మళ్లించిన తరువాత ఏడు గంటలపాటు గాల్లోనే విమానం ఉన్నట్లు తెలిసింది. మార్చి8 వ తేదీ అర్ధరాత్రి 12.40ని.లకు కౌలాలాంపూర్ లో బయల్దేరిన విమానం ఒక గంటల్లోపూ మాయమైంది. ఆ క్రమంలోనే విమానంలో సిగ్నల్ వ్యవస్థను పూర్తిగా పనిచేయకుండా నిలిపివేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొంతమంది విమానాన్ని దారి మళ్లించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ తెలుపుతోంది. మరుసటి రోజు ఉదయం 8.11గం.లకు విమానాన్ని శాటిలైట్ గుర్తించినా, ఆ ప్రాంతాన్ని గుర్తించడంలో మాత్రం విఫలమైందని ఎయిర్ లైన్స్ అధికారులు చెబుతున్నారు.
ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాలు నడపడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే సిగ్నళ్లు లేకపోయినా కూడా విమానాన్ని నడిపించగలరని, దక్షిణ చైనా సముద్రం వద్ద చివరిసారిగా దాని ఆచూకీ లభించిందని ఓ అధికారి చెప్పారు. ఐదు గంటల పాటు ప్రయాణించగల స్థాయిలో అందులో ఇంధనం ఉందని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే, ఆగ్నేయాసియాలోని స్వాత్ లోయ (పాకిస్థాన్) ప్రాంతం వరకు అది వెళ్లగలిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.