
కౌలాలంపూర్ విమానాశ్రయంలో ప్రార్థనలు
విమానం మలేషియా- వియత్నాం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని దారి మళ్లించారని, బహుశా కజకిస్థాన్- తుర్కెమెనిస్థాన్‌లకు తీసుకెళ్లి ఉండొచ్చని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ చెప్పారు.
మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేకపోతున్నామని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ అన్నారు. దాన్ని ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ విమానం మలేషియా- వియత్నాం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని దారి మళ్లించారని, బహుశా కజకిస్థాన్- తుర్కెమెనిస్థాన్‌లకు తీసుకెళ్లి ఉండొచ్చని రజాక్ చెప్పారు. లేదా ఇండోనేషియా- దక్షిణ హిందూ మహాసముద్రం వైపుగా కూడా తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అంతకుముందు వారం రోజులకు పైగా కనపడకుండా పోయిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయ్యిందని అధికారులు అంటున్నారు. ఈ సంఘటనపై తమ దర్యాప్తు పూర్తయిందని, ఈ దర్యాప్తులోనే ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. విమానం నడపడంలో బాగా అనుభం ఉన్నవాళ్లే ఈ విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, వాళ్లు విమానాన్ని హైజాక్ చేయగానే సమాచార వ్యవస్థకు సంబంధించిన సిగ్నళ్లు ఏవీ పనిచేయకుండా ఆపేశారని చెబుతున్నారు. బహుశా ప్రయాణికుల్లోనే ఈ హైజాకర్లు ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు వాళ్ల డిమాండ్లు ఏమీ తెలియలేదని, అలాగే ఎవరి నుంచి తాము విమానాన్ని అపహరించినట్లు ఫోన్లు కూడా రాలేదని అధికారులు వెల్లడించారు.
విమానాలు నడపడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే సిగ్నళ్లు లేకపోయినా కూడా విమానాన్ని నడిపించగలరని, దక్షిణ చైనా సముద్రం వద్ద చివరిసారిగా దాని ఆచూకీ లభించిందని ఓ అధికారి చెప్పారు. సాధారణ పౌర రాడార్కు విమానం సిగ్నళ్లు అందడం ఆగిపోయిన తర్వాత కాసేపు సైనిక రాడార్కు మాత్రం అందాయని ఆయన అన్నారు. దాన్నిబట్టి చూస్తే కావాలనే సమాచార సిగ్నళ్లను ఆపేసిన విషయం అర్థమవుతోందన్నారు. చిట్టచివరిసారిగా అది కనిపించిన తర్వాత నుంచి కనీసం ఐదు గంటల పాటు ప్రయాణించగల స్థాయిలో అందులో ఇంధనం ఉందని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే, ఆగ్నేయాసియాలోని స్వాత్ లోయ (పాకిస్థాన్) ప్రాంతం వరకు అది వెళ్లగలిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.