మోదీ తర్వాత ప్రధాని ఎవరు? | Mamata will be next Prime Minister, Trinamool claims | Sakshi
Sakshi News home page

మోదీ తర్వాత ప్రధాని ఎవరు?

Published Wed, Nov 16 2016 9:32 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

మోదీ తర్వాత ప్రధాని ఎవరు? - Sakshi

మోదీ తర్వాత ప్రధాని ఎవరు?

న్యూఢిల్లీ: ‘ఈ అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చిత్తుకాగితాలతో సమానం’ అని గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ  చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. కొద్ది మంది మినహా వారం రోజులుగా భారతదేశం మొత్తం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తోంది. ఇటు నిత్యావసరాలైన పాల దగ్గర్నుంచి పెట్రోల్ బంకుల దాకా జనం బాధలు చెప్పుకుంటే రాంలీలా! ఇంతలోనే‘నా చర్యలతో పేదవాడు ప్రశాంతంగా నిద్రపోయాడు’ అంటూ ప్రధాని చేసిన విలోమ ప్రకటన. వీటన్నింటి నేపథ్యంలో ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుత అధికార పార్టీకి చావుదెబ్బ తప్పదు’ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఇలా(అర్ధాంతరంగా ఎన్నికలు జరిగే) అవకాశం నూటికి నూరుపాళ్లు లేనప్పటికీ ఒక ప్రధాన పార్టీలో మాత్రం ‘భావి ప్రధాని’ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.
 
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణాలు ఆ చర్చకు మరింత బలాన్నివ్వడమేకాక మోదీ తర్వాత ప్రధాని ఎవనే ఆసక్తిని రెట్టింపుచేశాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో నోట్ల రద్దుతో జనం పడుతోన్న ఇబ్బందులే ప్రధాన ఆయుధంగా విపక్షాలు మోదీ సర్కారుపై యుద్ధం చేయనున్నాయి. నోటు పాట్లతోపాటు సర్జికల్ దాడులు, కశ్మీర్ పరిస్థితి, ఓఆర్ఓపీ, రైతు సమస్యలపైనా ప్రతిపక్షాలు ప్రశ్నల దాడి చేయనున్నాయి. ఎన్డీఏ అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఒకే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఏకతాటి నిర్ణయానికి వచ్చింది ఒక్క ‘నోట్ల రద్దు’ విషయం లోనేకావడం గమనార్హం. ఆ మేరకు మోదీ వ్యతిరేక గళాలన్నీ ఒకే రాగం ఆలపించేలా చేసిన ఘనత తమ అధినేత్రికే దక్కుతుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది.
 
నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయడంలో తలెత్తిన ఇబ్బందులపై మాత్రమే మాట్లాడుతూ, (రద్దు)నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న పార్టీగా కాంగ్రెస్‌‘నోట్ల రద్దు వ్యతిరేక’ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ముందుకురాలేదు. అదేసమయంలో మోదీ నిర్ణయాన్ని మొదటి రోజు నుంచే ఖండిస్తోన్న పశ్చిమ బంగా సీఎం మమత నాయకత్వానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు కనిపించింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రాష్ట్రపతిభవన్‌ వరకూ విపక్షాలన్నీ మార్చ్‌ నిర్వహించాలన్న మమత ప్రతిపాదనకు కాంగ్రెస్‌ పార్టీ మొదట తలొగ్గినా తర్జనభర్జనల తర్వాత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇంకో రెండున్నరేళ్లు కొనసాగించాల్సిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తాత్కాలిక అవసరం కోసం మమత వలలో పడటం భవిష్యత్తుకు ప్రమాదమని భావించడం వల్లే కాంగ్రెస్‌ మమతతో కలిసి మార్చ్‌ చేయడానికి వెనకడుగు వేసి ఉంటుందని విశ్లేషకుల భావన. చివరికి పార్లమెంటులో మాత్రమే అమీతుమీ తేల్చుకోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాగా మమత నేతృత్వంలో జరగనున్న మార్చ్‌ కు అనూహ్యరీతిలో బీజేపీ మిత్రపక్షం శివసేన అంగీకరించింది. వీరితోపాటు ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా కలిసి నడవనున్నారు. కీలక పార్టీలైన జేడీఎస్‌, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు కూడా మమతకు మద్దతు తెలిపే అవకాశం ఉంది.
 
మమత అనూహ్యంగా ఢిల్లీలో మెరిసిపోతుండటంతో ఉత్సాహభరితులైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ప్రెస్ మీట్లు పెట్టిమరీ ‘కాబోయే ప్రధాని మమతానే’ అనీ, ‘మోదీ తర్వాత దీదీనే’ అనీ ప్రకటనలు చేశారు. ఆ పార్టీకే చెందిన కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్‌ ఒక అడుగు ముందుకేసి 2019 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లొస్తాయనే లెక్కలు చదివారు. ఆయన ఊహ ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కానీ, కాంగ్రెస్‌ కానీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేవు. 42 ఎంపీ స్థానాలను గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా అవతరిస్తుంది. లాలూ, నితీశ్ లు తలో పాతిక సీట్లు, నవీన్ పట్నాయక్‌ బీజేడీ 20, డీఎంకే లేదా ఐఏడీఎంకేకి 40 సీట్లు, ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి 30 సీట్లు, మాయావతి బీఎస్పీకి 30 సీట్లు వస్తాయని, మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతే మమతా బెనర్జీ సులువుగా ప్రధానమంత్రి కాగలరని ముకుల్ రాయ్‌ జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement