
హోదా కోసం మరో బలిదానం
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్(50) ఆగస్టు 25వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వేలమందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన నినదించారు.
కాగా అప్పటినుంచి మెరుగైన వైద్యం కోసం పలు ఆసుపత్రుల్లో దుర్గాప్రసాద్ చికిత్స పొందారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య జ్యోతి, కూతుళ్లు శ్రావణి, నిఖిల ఉన్నారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.
దుర్గాప్రసాద్‌ది ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు. ''హోదా విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడంతో ప్రజలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ఇక తమ పిల్లలకు ఉద్యోగాలు రావని బాధపడుతున్నారు. అందుకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పంటలు పండుతున్న చెరుకుతోటలను తగలబెడుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంతం గురించి కమిటీలు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా తమకు నచ్చినచోట, నచ్చినట్లు రాజధాని నిర్మాణం చేపడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు'' అని ఆయన అన్నారు.