
ఫిర్యాదుకు వెళ్తే.. కాళ్లు నొక్కించుకున్న పోలీస్
లక్నో: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ వ్యక్తి పట్ల మోహన్ లాల్ గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ఓ) అమానుషంగా ప్రవర్తించాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తన కాళ్లు నొక్కాలంటూ ఎస్ హెచ్ఓ రామ్ యాగ్య యాదవ్ అతనికి చెప్పాడు. గత్యంతరం లేక ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఎస్ హెచ్ఓ కాళ్లు నొక్కాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన మొత్తం వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది.
వీడియోలో చూపిన ప్రకారం.. సమస్యను పోలీసులతో చెప్పుకోవడానికి వెళ్లిన వ్యక్తిని తొలుత యాదవ్ అవమానించాడు. తర్వాత తన కాళ్లు నొక్కాలని అతనికి చెప్పాడు. యాదవ్ అలా చెప్పడాన్ని ఆ వ్యక్తి మొదట జోక్ గా భావించాడు. కానీ బలవంతంగా యాదవ్ అతనితో తన కాళ్లు నొక్కించుకున్నాడు. కుర్చీలో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ అతనితో కాళ్లు పట్టించుకున్నాడు.
స్టేషన్ లో మిగిలిన అధికారుల అందరూ అక్కడే ఉండి ఈ ఉదంతాన్ని చూస్తూ నిలబడిపోయారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మంజిల్ సైనీ... ఎస్ హెచ్ఓ యాదవ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. అయితే, ఆ వ్యక్తి ఏ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్లాడన్న వివరాలు తెలియరాలేదు.