బెస్ట్ వర్సిటీల్లో మనవేవీ లేవు!
ఉపాధ్యాయుల కొరత వల్ల ప్రమాణాలు లోపిస్తున్నాయి
యూజీసీ వజ్రోత్సవాల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో లోపించిన నాణ్యతప్రమాణాలను ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో మనదేశానికి చెందిన విద్యాసంస్థలేవీ లేకపోవడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్నతవిద్య ప్రమాణాలపై నాణ్యమైన, అర్హులైన ఉపాధ్యాయుల కొరత తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), తత్సంబంధిత వర్గాలు ఆ సమస్యను తక్షణమే పరిగణనలోకి తీసుకుని, పరిష్కారం దిశగా వినూత్న మార్గాలను వెదకాల్సిన అవసరం ఉందని సూచించారు. యూజీసీ వజ్రోత్సవాల్లో ఆయన శనివారం పాల్గొన్నారు.
60 ఏళ్లుగా ఉన్నతవిద్యారంగంలో యూజీసీ చిరస్మరణీయ కృషి జరిపిందని, ఇంకా అత్యుత్తమ ప్రదర్శన రావాల్సి ఉందన్నారు. 1991లో ఆయన యూజీసీ చైర్మన్‌గా పనిచేశారు. దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ఐఐటీ)ల్లోనే ఉపాధ్యాయుల కొరత 32 శాతం ఉందని, అన్ని కేంద్ర వర్సిటీల్లోనూ ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయన్నారు. శాస్త్ర పరిశోధనలపై వర్సిటీలు దృష్టి పెట్టి, పీహెచ్‌డీల సంఖ్యను, నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాగా వజ్రోత్సవాల్లో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ దేశంలోని వివిధ వర్సిటీల్లో నోబెల్ అవార్డుల గ్రహీతల పేరిట ప్రత్యేక పీఠాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.