గోవా సీఎంగా మనోహర్ పారికర్ నియామకం
- రాత్రికిరాత్రే ఆహ్వానించిన గవర్నర్ మృదులా సిన్హా
- 15 రోజుల్లోగా బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశం
పణాజి: బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాషాయదళం గోవాలోనూ అధికారం చేపట్టింది. చిన్నపార్టీల నుంచే కాకుండా స్వతంత్ర్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందన్న బీజేపీని గవర్నర్ మృదులా సిన్హా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కొద్ది గంటలకిందటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. 15 రోజుల్లోగా పారికన్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు.
ఆదివారం రాత్రి మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో కలసి పారికర్.. గోవా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ ఉందని, 22 ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని పారికర్ చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేసినట్టు తొలుత వార్తలు వచ్చినా.. గడ్కరీ ఖండించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెప్పారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా గోవా ఫార్వర్డ్ పార్టీ (ముగ్గురు ఎమ్మెల్యేలు), ఏంజీపీ(ముగ్గురు ఎమ్మెల్యేలు)తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పారికర్ సీఎంగా రావాలని కోరారు. దీంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు 2014లో పారికర్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.