అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
పాలక్కడ్ : కేరళ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేశ్ చన్నీతాల వెల్లడించారు. అట్టపడ్డి అటవీ ప్రాంతంలో గస్తీ పోలీసులకు ఐదుగురు మావోయిస్టులు తారసపడ్డారు. ఆ క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని... దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందిన విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు మంత్రి రమేశ్ నిరాకరించారు. ఈ కాల్పుల్లో పోలీసులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పాలక్కడ్ జిల్లా కలెక్టర్ మేరీ కుట్టి స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోస్టర్లు, ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో భారీగా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.