Kerala forest
-
పదేళ్లుగా అధికారులను అరిగోస పెట్టిన అరికొంబన్.. చివరకు
ఇడుక్కి(కేరళ): రేషన్ దుకాణాల్లోకీ, ఇళ్లలోకీ చొరబడి బియ్యాన్ని బొక్కేస్తున్న ఏనుగు అరికొంబన్(25)ను ఎట్టకేలకు కేరళ అటవీ అధికారులు పట్టుకుని, మరో చోటుకు తీసుకెళ్లి వదిలేశారు. అరికొంబన్ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, దానికి బిగించిన రేడియో కాలర్ ద్వారా టైగర్ రిజర్వులో ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. అరికొంబన్ మళ్లీ జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఇడుక్కి జిల్లా చిన్నకనల్, సంతన్‌పర కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ గజరాజు. బియ్యం మాత్రమే స్వాహా చేస్తున్న ఈ గజరాజుకు అరి కొంబన్(మలయాళంలో అరి అంటే బియ్యం, కొంబన్ అంటే ఏనుగు)గా పేరు వచ్చింది. అరికొంబన్‌ను ఏం చేయాలన్న అంశం పలు వివాదాలకు దారితీసింది. అరికొంబన్‌ను పట్టుకుని, శిక్షణ ఏనుగు(కుమ్కి)గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అరికొంబన్‌ను జనావాసాలకు దూరంగా పరాంబికులమ్ టైగర్ రిజర్వులో వదిలి వేయాలని సూచించింది. దీనిపైనా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి కేరళ ప్రభుత్వం సూచనలతో.. ఆ ఏనుగును వదిలి వేసే ప్రాంతాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలన్న ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చింది. దీని ప్రకారం..అరికొంబన్‌కు మత్తిచ్చేందుకు శనివారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. లాభం లేకపోవడంతో అరికొంబన్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న మరో ఏనుగును తీసుకొచ్చాక సాయంత్రానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం సాధ్యపడింది. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి ర్యాంప్ మీదుగా వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. -
పుష్ప ప్లాన్ మారింది
ప్రస్తుతం ఉన్న అనిశ్చితిలో అనుకున్న పనులు అనుకూలంగా సాగుతాయని కచ్చితంగా చెప్పలేం. ముఖ్యంగా సినిమా చిత్రీకరణల ప్లాన్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా షూటింగ్ ప్లాన్ మారిందని సమాచారం. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా కథాంశం ఎర్రచందనం నేపథ్యంలో సాగుతుంది. దాంతో చిత్రీకరణను ఎక్కువ శాతం అడవుల్లో జరపనున్నారు. ముందుగా కేరళ అడవుల్లో సినిమాను షూట్ చేయాలనుకున్నారు. కోవిడ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న అటవీ ప్రాంతంలో అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు. తాజాగా మళ్లీ కేరళకే షూటింగ్‌ను షిఫ్ట్ చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. అందుకే ముందు అనుకున్నట్టుగా అక్టోబర్ కాకుండా డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభిస్తారట. మొదటి షెడ్యూల్లో దాదాపు 40 శాతం వరకూ షూటింగ్ పూర్తయిందని తెలిసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
కేరాఫ్ కేరళ అడవులు
కేరళ అడవుల్లోకి మకాం మార్చారు రానా దగ్గుబాటి. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారని తెలిసింది. తన కొత్త చిత్రం ‘విరాట పర్వం’ షూటింగ్ కోసమే ఈ కేరళ మకాం. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. నందితా దాస్, ప్రియమణి కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: డాని సాంచెజ్–లోపెజ్. -
అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
పాలక్కడ్ : కేరళ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేశ్ చన్నీతాల వెల్లడించారు. అట్టపడ్డి అటవీ ప్రాంతంలో గస్తీ పోలీసులకు ఐదుగురు మావోయిస్టులు తారసపడ్డారు. ఆ క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని... దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందిన విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు మంత్రి రమేశ్ నిరాకరించారు. ఈ కాల్పుల్లో పోలీసులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పాలక్కడ్ జిల్లా కలెక్టర్ మేరీ కుట్టి స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోస్టర్లు, ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో భారీగా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.