ఇడుక్కి(కేరళ): రేషన్ దుకాణాల్లోకీ, ఇళ్లలోకీ చొరబడి బియ్యాన్ని బొక్కేస్తున్న ఏనుగు అరికొంబన్(25)ను ఎట్టకేలకు కేరళ అటవీ అధికారులు పట్టుకుని, మరో చోటుకు తీసుకెళ్లి వదిలేశారు. అరికొంబన్ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, దానికి బిగించిన రేడియో కాలర్ ద్వారా టైగర్ రిజర్వులో ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. అరికొంబన్ మళ్లీ జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవన్నారు.
ఇడుక్కి జిల్లా చిన్నకనల్, సంతన్‌పర కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ గజరాజు. బియ్యం మాత్రమే స్వాహా చేస్తున్న ఈ గజరాజుకు అరి కొంబన్(మలయాళంలో అరి అంటే బియ్యం, కొంబన్ అంటే ఏనుగు)గా పేరు వచ్చింది. అరికొంబన్‌ను ఏం చేయాలన్న అంశం పలు వివాదాలకు దారితీసింది. అరికొంబన్‌ను పట్టుకుని, శిక్షణ ఏనుగు(కుమ్కి)గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు అడ్డుకుంది.
హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అరికొంబన్‌ను జనావాసాలకు దూరంగా పరాంబికులమ్ టైగర్ రిజర్వులో వదిలి వేయాలని సూచించింది. దీనిపైనా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి కేరళ ప్రభుత్వం సూచనలతో.. ఆ ఏనుగును వదిలి వేసే ప్రాంతాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలన్న ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చింది. దీని ప్రకారం..అరికొంబన్‌కు మత్తిచ్చేందుకు శనివారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి.
లాభం లేకపోవడంతో అరికొంబన్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న మరో ఏనుగును తీసుకొచ్చాక సాయంత్రానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం సాధ్యపడింది. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి ర్యాంప్ మీదుగా వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment