30 వాహనాలను తగలబెట్టారు
రాంచీ : జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బోకారో జిల్లా బెర్మో ప్రాంతంలో సెంట్రల్ కోల్ఫిల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)ప్రాజెక్టు వద్ద నిలిపి ఉన్న ఆ సంస్థకు చెందిన 30 వాహనాలపై మావోయిస్టులు దాడి చేసి తగలబెట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీఎల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విధ్వంసంలో దాదాపు 100 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. సీసీఎల్ ప్రాజెక్ట్ సైట్ వద్దకు శుక్రవారం ఆర్థరాత్రి భారీగా మావోయిస్టులు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోవాలని సీసీఎల్ భద్రత సిబ్బందిని ఆదేశించారు. ఆ తర్వాత వాహనాలను అగ్నికి ఆహుతి చేశారని పోలీసులు తెలిపారు. జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 18 జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.