నిత్యానంద
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అసలు బండారం బయట పడనుంది. అతనికి పురుషత్వ పరీక్షలు చేయనున్నారు. వచ్చే నెల 6న పురుషత్వ పరీక్షల కోసం విక్టోరియా ఆస్పత్రికి హాజరు కావాలని సిఐడి అధికారులు ఆదివారం నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. పరీక్షలకు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అతనిపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒక కేసుకు సంబంధించి అతనికి పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు.
పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని హైకోర్టును కోరారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. దాంతో సిఐడి అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.