మసూద్ అజర్ అరెస్ట్ అబద్ధమా?
అవునంటున్న పాక్ అధికార వర్గాలు
‘పఠాన్‌కోట్’ దర్యాప్తు వివరాలనూ వెల్లడించని పాక్
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ అరెస్ట్ విషయంలో పాకిస్తాన్ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. మసూద్ అజర్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయన భద్రత నిమిత్తమే గృహ నిర్బంధంలో ఉంచామని ఇప్పటికే పంజాబ్ న్యాయశాఖ మంత్రి స్పష్టం చేయగా.. పఠాన్‌కోట్ దాడి దర్యాప్తులో భాగంగా అజర్‌ను అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సంబంధిత అధికారులు తాజాగా కుండబద్దలు కొట్టారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం కట్టుకథేనని నిఘా వర్గాల సమాచారం అధారంగా తేల్చిచెప్పారు. దాడి విషయంలో జైషేపైగానీ, ఆ సంస్థకు సంబంధించిన వారిపైగానీ కేసులు పెట్టినట్లుగా పాక్ ఇంతవరకు భారత్‌కు చెప్పలేదు. జైషే సంస్థకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు మాత్రమే పాక్ పేర్కొంది. మరోవైపు, పఠాన్‌కోట్ దాడిపై పాక్ అట్టహాసంగా ప్రారంభించిన దర్యాప్తు వివరాలను పాక్ వెల్లడించడం లేదు.
గురుదాస్‌పూర్ ఎస్పీకి లై-డిటెక్టర్ పరీక్ష
పఠాన్‌కోట్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌పై లై-డిటెక్టర్ పరీక్ష జరిపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ప్రత్యేక కోర్టు సోమవారం అనుమతించింది. మూడు రోజుల్లోగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ పరీక్షకు సల్వీందర్ కూడా అంగీకరించారని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
బీఎస్‌ఎఫ్ అధికారులపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ
పంజాబ్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బీఎస్‌ఎఫ్ అధికారుపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడికి సంబంధించి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు ఏమైనా లోపాలు సాయపడ్డాయా అనే అంశాన్ని తేల్చేందుకు ఈ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు చెప్పారు.