రైతు ఆత్మహత్యలపై మాయ!
♦ వాస్తవ మరణాల్లో ప్రభుత్వ లెక్కలు 8 శాతమే
♦ ఎన్‌సీఆర్‌బీ లెక్క 2.38 లక్షలు.. ప్రభుత్వం లెక్క18,271
♦ ఆర్టీఐ పిటిషన్‌లో వెల్లడైన కఠోర వాస్తవాలు
♦ గరిష్టంగా మహారాష్ట్రలో.. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్నదాత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రకృతి విపత్తులతో పాటు ఆదుకోవాల్సిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తప్పుడు లెక్కలతో సమస్యను తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నం రైతన్న నడ్డి విరుస్తోంది. 2000-2014 మధ్య దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులెందరు? వారికి అందిన సాయం ఎంతనేదానిపై ఓ వార్తాసంస్థ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోగా.. చేదు వాస్తవాలు బయటపడ్డాయి. ఈ 15 ఏళ్లలో 18, 271 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో మాత్రం ఈ సంఖ్య అక్షరాలా 2,38,658 అని తేల్చేసింది.
అంటే అసలు ఆత్మహత్యలకు ప్రభుత్వం చూపెడుతున్న లెక్క 8 శాతం లోపే. దిగ్భ్రాంతి కలిగించే ఈ కఠోర వాస్తవాలు బయటపడకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని వ్యవసాయ శాఖ నిపుణులు అంటున్నారు. బిహార్, రాజస్తాన్‌లలో పదిహేనేళ్లలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. ఎన్‌సీఆర్‌బీ లెక్కలు మాత్రం ఈ సంఖ్య బిహార్‌లో 975 మంది, రాజస్తాన్‌లో 7,927 అని స్పష్టం చేశాయి. ఏ రాష్ట్రంలో చూసినా ఈ లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉంది. ఇంత తేడా ఏంటని ప్రశ్నించిన విపక్షాలకు.. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది.
ప్రేమ విఫలమై, నపుంసకత్వం, ఇతర కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి విమర్శల పాలయ్యారు. ప్రభుత్వ లెక్కలను పక్కన పెట్టి ఎన్‌సీఆర్‌బీ ఇచ్చిన సంఖ్యలను గమనిస్తే.. గడచిన 15 ఏళ్లలో గరిష్టంగా మహారాష్ట్రలో 54,941 మంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30,752 మంది అన్నదాతలు వ్యవసాయ కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
‘‘చాలా మంది రైతులు సొంత భూముల్లో వ్యవసాయం చేయటం లేదు. వీరిలో కౌలుదారులే ఎక్కువ. వీరు ఆత్మహత్య చేసుకున్నా.. వీరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని గుర్తిస్తే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందోనని వీరిని లెక్కించరు. రాష్ట్ర పరిస్థితి బాగానే ఉందని చూపించేందుకు అసలు మరణాలను లెక్కించటం లేదు’’.
- నాగరాజ్, మాజీ ప్రొఫెసర్ మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్