కాంగ్రెస్ వల్లే ఇదంతా..!
సాక్షి, న్యూఢిల్లీ: గత మూడురోజులుగా పార్లమెంటు స్తంభించడంపై పలు విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని స్పష్టం చేశాయి. జేడీయూ అధినేత శరద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఎం నేత బాసుదేవ్ ఆచార్య శుక్రవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన కు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో జరుగుతున్న ఆందోళనలు పార్లమెంటు ఉభయ సభలను వెంటాడుతున్నాయని శరద్ యాదవ్ అన్నారు. సభల ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని చెప్పారు.
‘పరిస్థితి మీరే చూస్తున్నారు.. సభ్యులు రోజూ వస్తున్నారు. వెళ్లిపోతున్నారు. పార్లమెంటు నడవకుంటే దేశం కూడా నడవదు’ అని అన్నారు. ‘అధికార పార్టీవారే ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన ఆ పని (విభజన) మమ్మల్ని గడచిన మూడు సమావేశాల నుంచి వెంటాడుతోంది. వారి వల్లే ఇదంతా జరుగుతోంది’ అని చెప్పారు.
తెలంగాణపై పార్లమెంటు స్తంభించడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిణామాలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అయితే తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులే అవిశ్వాస తీర్మానం ఇవ్వడం చూస్తుంటే.. ఆ పార్టీ కనుసన్నల్లోనే సభకు అంతరాయాలు కలుగుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయని సీపీఎం సభ్యుడు బాసుదేవ్ ఆచార్య వాఖ్యానించారు.
పార్టీలన్నీ కలసి పరిష్కరించుకోవాలి: షిండే
హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాత్రం పార్టీలన్నీ కలసి తెలంగాణ అంశాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో సభలో అంతరాయాలు ఏర్పడటం కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీలకు సంబంధించిన అంశం కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాధ్ పేర్కొన్నారు. ఇది సీమాంధ్ర ఎంపీలు వర్సెస్ తెలంగాణ ఎంపీలకు సంబంధించిన ప్రశ్న అన్నారు. ఈ సభలో పరిష్కారం కాకపోతే తదుపరి సభలో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.