యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: మాయా
లక్నో: సమాజ్వాది పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బహుజన సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. బదౌన్ గ్యాంగ్ రేప్ బాధితుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బదౌన్ ఘోరానికి పోలీసు అధికారులను బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం సరిపోదన్నారు.
రాష్ట్రంలో ఘోరాలు ఆగాలంటే ముందుగా సమాజ్వాది పార్టీ నాయకులకు కళ్లెం వేయాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమైందని మాయావతి ధ్వజమెత్తారు. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కలిసి కోరతామన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరారు. బదౌన్ జిల్లా కాత్రా సదత్‌గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.