తల్లి గర్భంలోనే తలనొదిలేశారు!
లక్నో: ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. ప్రసవం కోసం వచ్చిన ఓ నిండు చూలాలి గర్భం నుంచి శిశువును భద్రంగా బయటకు తీయడంలో నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా శిశువు బాడీ మాత్రమే బయటకు వచ్చింది. తల మాత్రం తల్లి గర్భంలో ఉండిపోయింది. జరిగిన పొరపాటును గ్రహించిన డాక్టర్లు ఆ తల్లి పట్ల మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తల్లి గర్భాశయంలో చిక్కుకుపోయిన శిశువు తలను వెలికి తీయడానికి ప్రయత్నించకుండా మరో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చారు. ఫలితంగా శిశువుతోపాటు తల్లి ప్రాణమూ పోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం నాడీ సంఘటన జరిగింది. 32 ఏళ్ల గీతాదేవీ శనివారం రాత్రి ప్రసవ వేదనతో షాజహాన్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అంతంత మాత్రంగానే సౌకర్యాలున్న ఆ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా తోడడవడంతో శిశువు ప్రాణాలు పోయాయి. గర్భ సంచిలో ఇరుక్కుపోయిన శిశువు తలను వెలికి తీసి తల్లి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు, సరైన సౌకర్యాలు లేవన్న సాకుతో గీతాదేవి భర్త హేమంత్‌ను పిలిచి మరో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
హేమంత్ తన భార్యను సమీపంలోని బెరైల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు తల్లి గర్భం నుంచి శిశువు తలను బయటకు తీయగలిగారు. అయితే తల్లి ప్రాణాలను మాత్రం కాపాడలేక పోయారు. సకాలంలో శిశువు తలను బయటకు తీసి ఉన్నట్టయితే ఆమె ప్రాణం పోయేది కాదని అక్కడి డాక్టర్లు చెప్పారు.
గీతాదేవీది సంక్లిష్టమైన డెలివరని, అలాంటి డెలివెరికి షాజహాన్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న షాజహాన్ పూర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ కేజీ యాదవ్ తెలిపారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు తల గర్భాశయంలో చిక్కుకు పోయిందని అన్నారు. అందుకు ఎవరు బాధ్యులో కనుక్కొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తల్లీ, శిశువుల మరణంపై జిల్లా కలెక్టర్ శుభ్రా సక్సేనా తీవ్రంగా స్పందించారు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యానికి సంబంధించిన తీవ్రమైన కేసని, దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అన్యాయంగా తల్లీ, బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం జరిగిందని ఆ అభాగ్యురాలి భర్త హేమంత్ కూడా ఆరోపిస్తున్నాడు.