ఐసీయూలో వైద్య విద్యార్థిని హత్య
దిబ్రుగడ్లోని అస్సాం మెడికల్ కాలేజీ ఐసీయూలో పీజీ వైద్య విద్యార్థి సరిత తస్నివాల్ (24) హత్య స్థానికంగా సంచలనం రేపింది. వైద్య విద్యార్థిని హత్యకు నిరసనగా జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. హత్యకు నిరసనగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని అటు జూడాలు, విద్యార్థులు డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు ఆసుపత్రి, ఐసీయూలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుడుకి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచించారు.
అయితే సరిత హత్య కేసులో నిందితుడు, ఆసుపత్రి ఐసీయూ వార్డు బాయి కిరు మెక్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సరితపై అత్యాచారానికి ఐసీయూ వార్డు బాయ్ ప్రయత్నించాడు. అందుకు సరిత ప్రతిఘటించింది. దాంతో ఆమెను శస్త్రచికిత్స చేసే కత్తితో పొడిచి చంపేశాడని దిబ్రుగఢ్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు.
గౌహతికి 470 కిలోమీటర్ల దూరంలోని శివసాగర్ జిల్లాకు చెందిన సరిత తస్నివాల్ అస్సాం మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం పీజీ విద్యను అభ్యసిస్తుంది. అయితే శుక్రవారం ఉదయం ఆసుపత్రిలోని ఐసీయూలో విగత జీవిగా పడి ఉంది. ఆ విషయాన్ని గమనించిన ఆసుపత్రి ఇబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో వార్డు బాయ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దాంతో ఆసుపత్రి జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళను దిగారు. హత్యకు గురైన సరిత అస్సాం మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుడిని గతేడాది జులై 7న వివాహం చేసుకుంది.